దుర్గమ్మ సన్నిధిలో రాష్ట్రపతి
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:21 AM
రాష్ట్రపతి ద్రౌపదిముర్ము విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను బుధవారం రాత్రి దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి...
గోత్రనామాలతో ప్రత్యేక అర్చన
అమ్మవారే రప్పించుకుందన్న ముర్ము
విజయవాడ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపదిముర్ము విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను బుధవారం రాత్రి దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణలు స్వాగతం పలికారు. రాష్ట్రపతి.. తొలుత డోనార్ సెల్ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం, రాజగోపురం వద్దకు చేరుకున్న ఆమెకు వేదపండితులు పూర్ణకుంభంతో ప్రధానాలయం వద్దకు తీసుకెళ్లారు.
అక్కడి నుంచి అంతరాలయంలోకి తోడ్కొని వెళ్లి.. గోత్ర(చంపక)నామాలతో అమ్మవారికి ప్రత్యేక అర్చన చేయించారు. తర్వాత ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ ఆమెకుఅమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. హోంమంత్రి అనిత పట్టువస్త్రాలను ఇచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు దుర్గాప్రసాద్ అమ్మవారికి సమర్పించిన పండ్లను రాష్ట్రపతికి అందించారు. శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతి హోదాలో అమ్మవారి దర్శనానికి వచ్చారని, ఆ తర్వాత మీరే వచ్చారని దుర్గాప్రసాద్ ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. దుర్గమ్మే తనను రప్పించుకుందని అరచేతులను ఆకాశం వైపు చూపిస్తూ వ్యాఖ్యానించారు. మొత్తంగా ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి 20 నిమిషాలపాటు గడిపారు. ఆలయంలోకి వెళ్లినప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు క్యూలైన్లలో ఉన్న భక్తులకు అభివాదం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..