Share News

వ్యాపారాలు ఎలా ఉన్నాయి..?

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:40 AM

సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తిరుమల ఆలయం వైష్ణవ సంప్రదాయంలో ప్రముఖ పుణ్యక్షేత్రం. కృష్ణానది తీరాన అభివృద్ధి చెందిన అమరావతి..

 వ్యాపారాలు ఎలా ఉన్నాయి..?

  • మీకు ప్రభుత్వం, బ్యాంకులు అండగా ఉన్నాయా?

  • లఖ్‌పతి దీదీలతో కలిసి భోజనం చేస్తూ రాష్ట్రపతి మాటామంతి

సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తిరుమల ఆలయం వైష్ణవ సంప్రదాయంలో ప్రముఖ పుణ్యక్షేత్రం. కృష్ణానది తీరాన అభివృద్ధి చెందిన అమరావతి.. నాగరికత శిల్పకళా శైలి, చారిత్రక వారసత్వ సంపదకు ప్రతిరూపం. విజయవాడ కనకదుర్గ మాతను దర్శించుకోవడం సంతోషంగా ఉంది.

- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సరస్‌ మేళాలో భాగంగా స్టాళ్లను ముర్ము ప్రారంభించారు. నెల్లూరు జిల్లాకు చెందిన భవాని ఎస్‌హెచ్‌జీ స్టాల్‌ను సందర్శించి...నిర్వాహకురాలు స్వర్ణలతతో సరదాగా ముచ్చటించారు. స్టాల్‌లో ఆమె విక్రయిస్తున్న పచ్చళ్లు, డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసిన చిరు తిళ్లు, స్వచ్ఛమైన నెయ్యి, తేనెలను పరిశీలించారు. వాటి ధరలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యానికి మేలుచేసే ఉత్పత్తులను విక్రయిస్తున్నారంటూ స్వర్ణలతను అభినందించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన శాంతి మజ్హి ఏర్పాటు చేసిన క్లాత్‌ స్టాల్‌లో కాటన్‌ సిల్క్‌, చందేరీ కాటన్‌, హ్యాండ్‌మేడ్‌ డిజైన్‌ చీరలను రాష్ట్రపతి పరిశీలించారు. గడ్డితో గృహోపకరణాలు తయారుచేసే స్టాల్‌ను, మగ్గం వర్క్‌ స్టాల్‌ను సందర్శించారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1500మంది మహిళలు 650 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వాటి ప్రారంభోత్సవం పూర్తయిన తరువాత పలువురు లఖ్‌పతి దీదీలతో రాష్ట్రపతి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో కలిసి భోజనం చేస్తూ సంభాషణ కొనసాగించారు. వ్యాపారస్తులుగా నిలదొక్కుకునేందుకు పాటించిన నియమాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారం లో మొదల్లో పడిన బాధల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ పరంగా అందుతున్న సాయం, బ్యాంకుల నుంచి అందుతున్న రుణ సదుపాయాన్ని లఖ్‌పతి దీదీలు వివరించారు.


వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు అవలంభించిన మార్గాలను తోటి మహిళలకు వివరించాలని వారికి రాష్ట్రపతి సూచించారు. కాగా, కాగా, ద్రౌపది ముర్ముకు సీతారాముల విగ్రహాన్ని సీఎం చంద్రబాబు బహూకరించారు. కాగా, అస్సాంకు చెందిన హ్యాండ్‌ మేడ్‌ క్లాత్‌ స్టాల్‌ నుంచి ఓ దుప్పటిని రాష్ట్రపతి కొనుగోలు చేశారు. దీనికి ఆమె స్వయంగా క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి యూపీఐ ద్వారా రూ.4,500లను స్టాల్‌ యజమాని బర్మిళి పథాక్‌కు బదిలీ చేశారు.

సృజనాత్మక సంకల్పానికి ‘సరస్‌’ ప్రతీక

  • -గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ వెల్లడి

దేశం నలుమూలల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళల బలం, సృజనాత్మకత, వ్యాపార నైపుణ్యం, సంకల్పానికి ప్రతీకగా సరస్‌ మేళా నిలుస్తుందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కొనియాడారు. ‘‘దేశాభివృద్ధికి, మహిళా సాధికారతకు స్వయం సహాయక సంఘాలు శక్తివంతమైన సాధనాలుగా మారాయి. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మేళాలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు 630 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ 50 వేల నుంచి లక్ష మంద్రి సందర్శకులు వస్తారనే అంచనా ఉంది.’’ అని వివరించారు.

  • లఖ్‌పతి దీదీల్లో ఏపీ టాప్‌

మహిళా స్వావలంబనకు బాబు కృషి

కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

లఖ్‌పతి దీదీలను తీర్చిదిద్డడంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. ‘‘ఏపీలో ఇప్పటికే 11లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు సంకల్పం తీసుకున్నారు. సాంకేతిక సాయంతో మహిళలను బలోపేతం చేస్తున్నారు. షీ మార్టుల ద్వారా మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్‌ పెద్దఎత్తున చేపడతాం. ఈ అంశంలో ఏపీ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం. వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం ఉండాలి.’’ అని అన్నారు.


  • 3.50 కోట్లకు చేరిన లఖ్‌పతి దీదీలు

- కేంద్ర మంత్రి పెమ్మసాని

దేశంలో 6కోట్ల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ తమ శాఖకు దిశానిర్దేశం చేశారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఇప్పటికే 3.50 కోట్ల మందిని లఖ్‌పతి దీదీలుగా తయారు చేశావన్నారు. ‘‘ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారుచేయాలనే లక్ష్యంతో ఏపీ పనిచేస్తోంది. 2014లో రూ.23వేల కోట్లుగా ఉన్న మహిళా సంఘాల వార్షిక రుణ లావాదేవీలు, .13 లక్షల కోట్లకు చేరాయి. ఎస్‌హెచ్‌జీలకు ఊతమిచ్చేలా రూ.20 లక్షల రుణాలపై ప్రాసెసింగ్‌, తనిఖీ, డాక్యుమెంటేషన్‌ చార్జీలు రద్దు చేశాం. దీనివల్ల ఒక్కో సంఘానికి రూ.33 వేల వరకు ఆదా అవుతుంది.’’ అని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 03:40 AM