Share News

మహిళా సత్తా చాటాలి

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:36 AM

దేశంలోని మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్‌ మేళా-2026ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

మహిళా సత్తా చాటాలి

  • ఆర్థికం, అభివృద్ధి, ఆదాయ సాధనలో వారి పాత్ర పెరగాలి.. ఇదే ప్రభుత్వాల లక్ష్యం కావాలి

  • మహిళ ఎదిగితే 2047కు ముందే దేశాభివృద్ధి

  • లఖ్‌పతి దీదీలను ఒక మెట్టు పైకి ఎక్కించాలి

  • వారిని కోటీశ్వరులను చేసేందుకు కృషి చేయాలి

  • సంస్కృతి, వారసత్వ సంపదకు ఏపీ రక్షణ

  • నాగరిక శిల్పకళా శైలికి అమరావతి నిదర్శనం

  • విజయవాడలో సరస్‌ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము.. లఖ్‌పతి దీదీలతో మాటామంతీ

విజయవాడ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): దేశంలోని మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్‌ మేళా-2026ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. సరస్‌ మేళా నిర్వహణను మహిళల అభివృద్ధికి ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించారు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాల్లో ఇలాంటి మేళాలు జరగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘‘దేశంలోని వైవిధ్యభరితమైన ఉత్పత్తులను ఒకే ప్రాంగణంలో ప్రదర్శించడానికి, వాటి ద్వారా ఆదాయం పొందేందుకు ఇలాంటి మేళాలు ఉపయోగపడతాయి.

మహిళలు స్వయం శక్తితో ఎదగడానికి ఆర్థికంగా స్వతంత్రులుగా మారడానికి ప్రేరణ కల్పిస్తాయి. గతంలో మహిళలు చిన్నచిన్న అవసరాల కోసం సైతం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం మహిళలు స్వతంత్రులుగా మారుతూ, తమ కుటుంబాలకు అండగా నిలవడమే కాకుండా, ఇతరులకూ సహాయంచేసే స్థాయికి ఎదుగుతున్నారు. మహిళల ఆదాయం వారి కుటుంబాలకే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. దేశంలోని అనేక మంది మహిళలు నేడు రూ.2 లక్షలకు మించి ఆదాయం పొందుతున్నారు. మహిళల ఆర్థిక భాగస్వామ్యం పెరగడం దేశ అభివృద్ధిలో కీలకం. దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. పురుషులతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.’’ అని రాష్ట్రపతి సూచించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..


మహిళలు స్వతంత్రంగా ఎదగాలి

‘‘2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి సంకల్పించారు.మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగితే, 2047 కంటే ముందే అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే అవకాశం ఉంటుంది. గ్రామీణ మహిళల అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. మహిళల ఆర్థిక, సాంకేతిక, సామాజిక సాధికారతకు దోహదపడుతున్నాయి. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలతో అనుసంధానమైన మహిళల సంఖ్య 10 కోట్లకు మించింది. వారంతా గ్రామీణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. మహిళలు లఖ్‌పతి దీదీ(లక్షాధికారి)లుగా మిగిలిపోకుండా కరోడ్‌ పతి దీదీ(కోటీశ్వరులు)లుగా ఎదగాలి. మహిళల ఆదాయం మరింత పెరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని అవకాశాలు కల్పించాలి. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు విస్తరించేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయం, పశుపోషణ, చిన్న తరహా వ్యాపారం, పోషకాహారం తయారీ, విద్య, స్థానిక పాలన వంటి రంగాల్లో గ్రామీణ మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. మహిళా వ్యాపార వేత్తలకు గ్రామీణ మహిళా రైతులను అనుసంధానం చేసే కార్యక్రమాలు విస్తృతం కావాలి. మధ్యవర్తులపై ఆధారపడకుండా మహిళలు స్వతంత్రంగా ఎదగాలి.’’


గ్రామీణ మహిళా పారిశ్రామిక వ్యవస్థ బలోపేతం

‘‘ఒకప్పుడు బ్యాంక్‌కు వెళ్లడానికే మహిళలు సంకోచించేవారు. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. గతంలో పిల్లలకు పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు కొనివ్వలేని స్థితిలో తల్లులు ఉండేవారు. గతానికి పూర్తి భిన్నంగా నేటి మహిళలు కుటుంబానికి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఈ మేళాలో ఉత్పత్తులకు బ్రాండింగ్‌, ప్యాకేజింగ్‌, మార్కెటింగ్‌ నెట్‌వర్క్‌, వినియోగదారులతో సంభాషణ, వ్యాపార నిర్వహణ తదితర అంశాల్లో మహిళలు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం పొందుతున్నారు. భారతీయ సంస్కృతి ప్రకారం శక్తి వల్లే శివుడు పరిపూర్ణతను పొందుతాడు. దేశ ప్రగతికి స్త్రీ, పురుషులు సమన్వయంతో కృషి చేయడం అనివార్యం. ప్రతి కుటుంబంలో సోదరీ,సోదరులు ఉమ్మడిగా పని చేయాలి.

ఈసారి వచ్చినప్పుడు తెలుగు నేర్చుకుంటా..

తనది ఆంధ్రప్రదేశ్‌ పక్క రాష్ట్రమే అయినప్పటికీ తెలుగు నేర్చుకోలేక పోయానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినపుడు తెలుగు నేర్చుకుని, తెలుగులోనే ప్రసంగించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమానికి ముందు మేళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించారు. పలువురు మహిళా వ్యాపారవేత్తలతో మాట్లాడారు. అస్సాకు చెందిన ఓ స్టాల్‌ నుంచి రూ.4,500 ఖరీదైన దుప్పట్లను కొనుగోలు చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాలులర్పించారు.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 03:36 AM