పల్లె చెరువులకు కొత్తకళ
ABN , Publish Date - Sep 05 , 2026 | 05:45 AM
గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వనరుల పరిరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా చెరువుల ఆధునికీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
50 కోట్లతో 105 చెరువుల ఆధునికీకరణ
సాగునీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యం
గట్ల బలోపేతంతో పాటు వాకింగ్ ట్రాక్‌లు,
పార్కులు, ఓపెన్ ఎయిర్ జిమ్‌లు ఏర్పాటు
ఇప్పటికే 26 చెరువుల అభివృద్ధి పూర్తి
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వనరుల పరిరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా చెరువుల ఆధునికీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవకు ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన తోడవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 105 చెరువులను ఆధునికీకరిస్తున్నారు. సుమారు రూ.50 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఇప్పటికే అనంతపురం, పల్నాడు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీసత్యసాయి, కాకినాడ, గుంటూరు జిల్లాల్లోని 26 చెరువుల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. సెప్టెంబరు నెలాఖరు కల్లా పనులన్నీ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని యంత్రాంగాన్ని పవన్‌కల్యాణ్ ఆదేశించారు. చెరువుల ఆధునికీకరణలో భాగంగా గట్ల బలోపేతంతో పాటు వాకింగ్ ట్రాక్‌లు, ప్రవేశద్వారాలు, సోలార్ లైట్లు, సిట్టింగ్ బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల కోసం పార్కులు, ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ ఎయిర్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో చెరువులు కేవలం నీటి వనరులుగానే కాకుండా ప్రజలకు విశ్రాంతి, ఆరోగ్యం, వినోదాన్ని అందించే ఆహ్లాదకర కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని వెదుళ్ల చెరువు, కాకినాడ రూరల్‌లోని పండూరు, గుంటూరు జిల్లా వెంగళాయపాలెం, అనంతపురం జిల్లాలోని గుడిశెలపల్లి, నెల్లూరు జిల్లా వింజమూరు, శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రం తదితర చెరువుల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
భూగర్భ జలాల పెంపునకు దోహదం
చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంచడం వల్ల సాగునీటి వనరులు బలోపేతం కావడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరిగే అవకాశముంది. దీంతో రైతులకు సాగునీటి ప్రయోజనం కలగడంతో పాటు దీర్ఘకాలికంగా నీటి భద్రత పెరగనుంది. చెరువుల అభివృద్ధి పనుల వేగంతో పాటు నాణ్యతపైనా పవన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పనుల్లో వేగం, నాణ్యత రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, రాష్ట్రంలో కార్యక్రమాల అమలుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్‌కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. సాగునీరు, భూగర్భజలాలు, పర్యావరణం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు... అన్నీ అంశాలను సమన్వయం చేస్తూ చెరువుల ఆధునికీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఈ వార్తలను కూడా చదవండి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు: ఎంపీ శ్రీభరత్