వైసీపీ కార్యకర్త ఇంట్లో 10 లక్షలు స్వాధీనం
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:03 AM
శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీ కార్యకర్త ఇంట్లో పోలీసులు నిర్వహించిన సోదాల్లో రూ.10 లక్షల నగదు పట్టుబడింది. మండల పరిషత్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఈ మొత్తాన్ని తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతోంది
ఎన్నికల్లో ఖర్చు చేసేందుకే తెచ్చారన్న అనుమానాలు
పలాస, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీ కార్యకర్త ఇంట్లో పోలీసులు నిర్వహించిన సోదాల్లో రూ.10 లక్షల నగదు పట్టుబడింది. మండల పరిషత్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఈ మొత్తాన్ని తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన నగదుగా ఇంటి యజమాని పినకాన ముకుందరావు చెబుతున్నారు. పలాస పట్టణంలోని వివేకానంద కాలనీలో నివాసం ఉంటున్న ముకుందరావు ఇంట్లో సోమవారం సాయంత్రం కాశీబుగ్గ సీఐ ఎం.అప్పారావు ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఇంట్లో దాచిన రూ.10 లక్షలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
పంచనామా నిర్వహించి నగదును పలాస ఖజానాకు తరలించారు. సోదాల సమయంలో ముకుందరావుతో పాటు వైసీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముకుందరావు పలాస మండల జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి బమ్మిడి దుర్యోధనరావుకు బంధువు. రాజకీయ విభేదాలతోనే తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన... ఈ ఘటనపై మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదు విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందిస్తామని డీఎస్పీ జీవీ రమణ తెలిపారు. ఈ ఘటనపై ఎస్‌ఐ ఎం.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి