జగదీశ్వరరెడ్డి హత్యకు కుట్ర!
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:12 AM
కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక నిందితుడు షేక్ సాదిక్‌ఖాన్ రెండు రోజుల కస్టడీ శుక్రవారంతో ముగిసింది.
సైనేడ్, థాయ్ పొటాషియం వినియోగంపై యూట్యూబ్ వీడియోలతో సమాచార సేకరణ
చాట్ జీపీటీ, ఏఐ సాయం కూడా తీసుకున్నా
కొబ్బరి నీళ్లు, ప్రొటీన్ డ్రింక్‌లో కలిపి ఇచ్చాం
పోలీసుల విచారణలో అంగీకరించిన సాదిక్
ముగిసిన సాదిక్ ఖాన్ రెండు రోజుల కస్టడీ
దాడికి ఉపయోగించిన చాకు స్వాధీనం
కాకినాడ, సర్పవరం జంక్షన్, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక నిందితుడు షేక్ సాదిక్‌ఖాన్ రెండు రోజుల కస్టడీ శుక్రవారంతో ముగిసింది. రెండో రోజు విచారణలో నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్యలో సాదిక్ పాత్ర నిర్ధారణకు సంబంధించిన పది కీలక ఆధారాలను సర్పవరం పోలీసులు సేకరించారు. తొలిరోజు ‘‘నాకేమీ తెలియదు.. నేనేమీ చెప్పలేను.. అంతా సౌజన్యే చేసింది’’ అని చెప్పిన సాదిక్ చివరిరోజు జగదీశ్వరరెడ్డి హత్యలో తన పాత్రను పూర్తిగా వివరించాడు. నూకరాజు కుటుంబం ఆస్తులు, జగదీశ్వరరెడ్డి ఆస్తులు దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే అతడి హత్యకు కుట్ర పన్నినట్టుగా పోలీసుల ఎదుట సాదిక్ గుట్టువిప్పినట్టు తెలిసింది. ఈ కుట్రలు, కుతంత్రాలకు సౌజన్యను పావుగా వాడుకున్నట్టు సమాచారం.
అంతా యూట్యూబ్, చాట్ జీపీటీ, ఏఐ ద్వారానే..
‘‘జగదీశ్వరరెడ్డిని ఎలా హతమార్చాలనే విషయమై యూట్యూబ్‌లో పలు వీడియోలు వెతికాను. చాట్ జీపీటీ, ఏఈ సాయం కూడా తీసుకున్నా. సైనేడ్ ఎలా వినియోగించాలి?, ఎందులో కలపాలి?, థాయ్ పొటాష్ ఎక్కడ దొరుకుతుంది?, ఎలా కొనుగోలు చేయాలి?, ఎంత మోతాదులో కలిపి ఇవ్వాలి? అనే అంశాలకు సంబంధించి అనేక వీడియోల ద్వారా సమాచారం సేకరించాను. అనంతరం హైదరాబాద్‌లో పరిచయం ఉన్న అత్తరు వ్యాపారులను సంప్రదించి, వాటిని కొనుగోలు చేశాను. కొబ్బరి నీళ్లు, ప్రొటీన్ డ్రింక్‌లో వాటిని కలిపి జగదీశ్వరరెడ్డికి రెండు మూడుసార్లు అందించాం’’ అని పోలీసుల ఎదుట సాదిక్ ఒప్పుకున్నట్టు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న జగదీశ్వరరెడ్డి, సౌజన్య కారులో పిఠాపురం వెళ్తుండగా సౌజన్యకు సాదిక్ ఖాన్ పదేపదే ఫోన్ చేయడం, దీన్ని గమనించిన జగదీశ్వరరెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. అశోక్‌నగర్‌లోని తమ ఫ్లాట్‌కు జగదీశ్వరరెడ్డి, సౌజన్య తిరిగొచ్చిన సమయంలో వారింటికి వచ్చిన సాదిక్, గొడవపడి అక్కడే ఉన్న చాకుతో జగదీశ్వరరెడ్డిపై పలుమార్లు దాడి చేయడం వంటి విషయాలను కూడా ఒప్పుకొన్నాడు.
ఆ సమయంలో అతను వినియోగించిన చాకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య, జగదీశ్వర రెడ్డి హత్య కుట్రలో సాదిక్ పాత్రను తేల్చే ఆధారాలను పోలీసులు సేకరించారు. వాటిని శనివారం న్యాయాధికారి ఎదుట ఉంచనున్నారు. జగదీశ్వరరెడ్డి మరణానికి కొన్ని రోజుల ముందు సాదిక్ ఫోన్‌పే, బ్యాంక్ లావాదేవీలను పోలీసులు ఇప్పటికే పరిశీలించారు. వాటిలో ఇబ్రహీం అనే వ్యక్తికి రూ.30 వేలు, రూ.40 వేలు ఇలా రెండు విడతలుగా రూ.70 వేలు ఫోన్‌పే చేసినట్టుగా గుర్తించారు. సైనేడ్ కొనుగోలు కోసమే సాదిక్ తనకు ఫోన్‌పే చేశాడని పోలీసుల ఎదుట ఇబ్రహీం అంగీకరించాడు. శుక్రవారం కూడా అతడిని పోలీసులు పిలిపించి, మరోసారి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. కాగా, నూకరాజు కుమార్తె సౌజన్య ఆత్మహత్యకు ముందు సుమారు రూ.40 లక్షల విలువ చేసే బంగారు నగలను అమ్మేసి అప్పులు తీర్చినట్టు సాదిక్ వెల్లడించాడని పోలీసులు తెలిపారు. మొత్తం మీద ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలతో సాదిక్ చుట్టూ పోలీసులు ఉచ్చుబిగించినట్టు తెలుస్తోంది. అతడి ల్యాప్‌టాప్‌లో లభించిన వీడియో ఫుటేజీ, స్లోపాయిజన్ కొనుగోలు సమయంలో చేసిన ఫోన్‌పే హిస్టరీ ఈ కేసులో కీలకం మారనున్నాయి. ఇదిలాఉండగా, నూకరాజు కుటుంబ సభ్యులు వినియోగించే కార్లను తాము స్వాధీనం చేసుకోలేదని పోలీసులు వెల్లడించారు.
‘నన్ను ఇబ్బంది పెడితే జడ్జికి చెబుతా’!
విచారణలో పోలీసులపై సాదిక్ ఎదురుదాడి
గతనెలలో జరిగిన మూడు రోజుల విచారణలో పోలీసులకు సహకరించని సాదిక్ ఖాన్ గురు, శుక్రవారాల్లో జరిగిన విచారణలోనూ అదే ధోరణిలో కనిపించాడు. ‘‘నన్ను ఇబ్బంది పెడితే.. మీ సంగతి జడ్జికి చెబుతా.. మీపై ఫిర్యాదు చేస్తా’’ అంటూ పోలీసులపై ఎదురుదాడికి దిగినట్టు తెలిసింది. ఈ రెండు రోజుల విచారణలో పోలీసులు సుమారు 106 ప్రశ్నలు సంధించారు. వాటిలో చాలావాటికి సాదిక్ తలబిరుసు సమాధానాలే ఇచ్చినట్టు తెలిసింది.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు