దుండగులపై తూటా!
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:36 AM
అభం శుభం తెలియని చిన్నారులు, ఆడపిల్లలే లక్ష్యంగా కొందరు ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. బాలికలకు ప్రేమ పేరుతో వేధింపులు. నిరాకరిస్తే దాడులు.. అత్యాచార యత్నాలు. బాలలను కిడ్నాప్ చేసి హత్య చేయడం వంటి దారుణాలకు తెగబడుతున్నారు.
చిన్నారులపై భయానకదాడులు, హత్యలు
పోలీసులపైనా దాడి చేస్తున్న ఉన్మాదులు
గన్ తీసి బుల్లెట్ దించుతున్న పోలీసులు
ఇతరులకు హాని చేసి తమ జీవితాలనూ నాశనం చేసుకుంటున్న సైకోలు
ఉమ్మడి అనంత జిల్లాలో వరుస ఘటనలు
రాప్తాడులో తారస్థాయికి రాక్షసత్వం
తుపాకులకు పనిచెబుతున్న పోలీసులు
(అమరావతి - ఆంధ్రజ్యోతి): అభం శుభం తెలియని చిన్నారులు, ఆడపిల్లలే లక్ష్యంగా కొందరు ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. బాలికలకు ప్రేమ పేరుతో వేధింపులు. నిరాకరిస్తే దాడులు.. అత్యాచార యత్నాలు. బాలలను కిడ్నాప్ చేసి హత్య చేయడం వంటి దారుణాలకు తెగబడుతున్నారు. ఎవరికో హాని చేయబోయి చివరకు నిందితులు తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపైనా ఏమాత్రం భయం లేకుండా దాడులకు తెగబడుతున్నారు. ఉన్మాదుల ఆగడాలు హెచ్చుమీరడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తుపాకులకు పని చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో మహిళలు, బాలికలు, చిన్నారులకు రక్షణ లేకుండా చేస్తున్న నేరగాళ్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ఎస్పీ జగదీశ్ నేతృత్వంలో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. పలు సందర్భాల్లో నిందితులు ఎదురుదాడులకు దిగినా, పారిపోయేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గకుండా వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా రాప్తాడులో బాలికపై రాక్షసదాడికి పాల్పడిన ఉన్మాది హేమంత్‌పై కాల్పులు జరపడం ఈ చర్యల్లో మరో కీలక పరిణామం. బాలికలు, బాలురపై దాడులు, హత్యలకు పాల్పడుతున్న నిందితులు పోలీసులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారు.
దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిందితులు దివ్యాంగులుగా మారుతున్నారు. రాప్తాడు ఉదంతంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఘటనలు పోలీసు కాల్పుల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. తాడిపత్రిలో సర్వేశ్ అనే నిందితుడు ఓ బాలుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో సర్వేశ్‌ను పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు ఖాళీ బీర్ బాటిల్‌తో ఒక్కసారిగా పోలీసులపై దాడికి దిగాడు. పెద్దవడుగూరు సీఐ రామసుబ్బయ్యతో పాటు ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు. నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు హెచ్చరించారు. అయినా వినకపోవడంతో అతడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం టూ టౌన్ పరిధిలో అరవిందనగర్‌లోని అయ్యప్ప కేఫ్ వద్ద మద్యం సేవించే క్రమంలో అజయ్ అనే యువకుడు తన స్నేహితుడు రాజాపై కత్తితో దాడి చేశాడు. ఈ కేసులో నిందితుడు ఆకుతోటపల్లి సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. టూ టౌన్ సీఐ శ్రీకాంత్ బృందం అక్కడికి చేరుకుని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అజయ్ కత్తితో సీఐపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సీఐ ఆత్మరక్షణ కోసం తన రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అజయ్ మోకాలికి గాయమైంది.
హిందూపురం ప్రాంతంలో...
హిందూపురం ప్రాంతంలోనూ ఈ ఏడాది పోలీసు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరిలో ఎర్రకొండ ప్రాంతంలో పోలీసులపై దాడికి యత్నించిన రౌడీషీటర్ నాగేంద్రపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టులో ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో పశువులు, పందుల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు వెంబడించారు. ఊటుకూరు సమీపంలో నిందితులు పోలీసు వాహనాన్ని ఢీకొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో వారిని నిలువరించేందుకు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
రాప్తాడులో రాక్షసత్వం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరుస ఘటనల పరంపరలో తాజాగా రాప్తాడులో భయానక దాడి జరిగింది. హేమంత్ అనే ఉన్మాది పాఠశాల తరగతి గదిలోకి చొరబడి ఎలక్ట్రిక్ రంపంతో బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ కేసులో నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో కాల్పులు జరిగాయి.
పోలీసులపైనే దాడులు.. తప్పించుకునే యత్నాలు
నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడులకు దిగడం, విచారణలో భాగంగా నేరస్థలాల వద్దకు తీసుకెళ్లినపుడు తప్పించుకునేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ప్రతి ఘటనలోనూ కాల్పులకు దారితీసిన పరిస్థితులు, వాటి సమర్థన, తదనంతర దర్యాప్తు అంశాలు కీలకంగా మారుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలీసు భద్రత, నిందితుల తరలింపు, సీన్ రీ కన్‌స్ట్రక్షన్ సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు చర్చనీయాంశమవుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి