Designers Proposal: పోలవరం స్పిల్‌వేకు ‘ద్రవిడియన్ తోరణాలు’!
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:54 AM
పోలవరం సాగునీటి ప్రాజెక్టు తొలిదశ అనుకున్న లక్ష్యానికి.. అంటే 2027 ఉగాది పర్వదినానికి ముందే ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు.
సీఎం చంద్రబాబుకు డిజైన్లు ప్రతిపాదించిన నిర్మాణ సంస్థ
ఉగాదినాటికే ప్రాజెక్టు తొలిదశ పూర్తిచేసేందుకు అంగీకారం
అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): పోలవరం సాగునీటి ప్రాజెక్టు తొలిదశ అనుకున్న లక్ష్యానికి.. అంటే 2027 ఉగాది పర్వదినానికి ముందే ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. ఈ నెల ఏడో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఇక్కడి సమీక్ష సమావేశంలో 2027 జూన్ నాటికి పోలవరం తొలిదశ పూర్తి చేస్తామంటూ అధికారులు ఇచ్చిన లక్ష్యాన్ని మూడు నెలల ముందుకు కుదించారు. మార్చినాటికే ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికి మేఘా ఇంజనీరింగ్ అధిపతి కృష్ణారెడ్డి ఆమోదించారు. ఇదే సమయంలో స్పీల్‌వేను కళాతోరణంతో అలంకరించాలన్న ప్రతిపాదనలతో కూడిన డిజైన్లను నిర్మాణ సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంచింది. ద్రవిడయన్ సంస్కృతితో కూడిన డిజైన్లను ముఖ్యమంత్రికి చూపించింది. వీటిని అమరావతిలో కూర్చొని చర్చించి, ఖరారు చేద్దామంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.