పోలవరం చకచకా
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:36 AM
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు కీలక నిర్మాణ పనులు లక్ష్యాలను చేరుకుంటున్నాయి. తొలిదశలో పలు కీలక నిర్మాణాలను పూర్తి చేశారు. మిగిలిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు...
ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు పూర్తి
తొలిదశ పనుల్లో గణనీయ పురోగతి
వచ్చే ఏడాదికి ప్రధాన పనులు పూర్తి
ఇప్పటి వరకు కేంద్రం 23,485 కోట్ల విడుదల
96 శాతం భూసేకరణ పూర్తి
పోలవరం ప్రాజెక్టు అథారిటీ నివేదిక
అమరావతి, పోలవరం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు కీలక నిర్మాణ పనులు లక్ష్యాలను చేరుకుంటున్నాయి. తొలిదశలో పలు కీలక నిర్మాణాలను పూర్తి చేశారు. మిగిలిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. పీపీఏ ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. సెప్టెంబరు నాటికి ప్రాజెక్టు తొలిదశలో భౌతిక పనుల పురోగతి 90 శాతానికి చేరింది. కేంద్రం ఇప్పటి వరకు రూ.23,485 కోట్లను విడుదల చేయడంతో భూసేకరణ 96 శాతం మేర జరిగింది. ఈ నెల 12న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అర్చనా వర్మ అధ్యక్షతన జరిగిన సమీక్షలో పీపీఏ ఈ వివరాలను వెల్లడించింది.
ప్రాజెక్టు తొలిదశకు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు 2024 ఆగస్టు 28న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.23,485.31 కోట్లను విడుదల చేసింది. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో పనులను వేగవంతం చేసేందుకు రూ.7862.93 కోట్ల ముందస్తు గ్రాంటును కేంద్రం విడుదల చేసింది.
2026-27 కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టు అనుసంధాన పనులను ఈ ఏడాది డిసెంబరులోగా పూర్తి చేయాలని పీపీఏ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రాజెక్టు కంట్రోల్ భవనం, సబ్స్టేషన్లు, రహదారులు, రక్షణ పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలను ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తి చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ స్పష్టం చేసింది. పునరావాస కాలనీలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని సూచించింది.
ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్ వే, ప్రధాన డ్యామ్‌లో గ్యాప్-3, గ్యాప్-1, గ్యాప్-2 డయాఫ్రమ్‌వాల్ గోడలు, ఎగువ-దిగువ కాపర్ డ్యామ్‌లు, బట్రస్ డ్యామ్, కుడి ప్రధాన కాలువ నిర్మాణాలు పూర్తయినట్లు పీపీఏ నివేదికలో పేర్కొన్నారు. ప్రధాన డ్యామ్‌లోని గ్యాప్-1, గ్యాప్-2 ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు కొనసాగుతున్నాయి. గ్యాప్-1లో 49.53 శాతం పనులు చేశారు. ఈ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయి. గ్యాప్-2లో 44.53 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
ప్రాజెక్టు పూర్తయితే 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందుతుంది. ఇప్పటికే సాగులో ఉన్న 23.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ప్రధాన కాలువల ద్వారా 540 గ్రామాల్లో 28.5 లక్షల మందికి తాగునీరు అందుతుంది. గోదావరి నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించడం ద్వారా రాయలసీమ ప్రాంతంలో కృష్ణా జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. పారిశ్రామిక అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని అందించాలన్న ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ముంపు బ్యాక్‌వాటర్ అధ్యయనాలు, ఇతర సాంకేతిక అంశాలపై సమన్వయం కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియలు ఇంకా పూర్తి కావాల్సి ఉందని నివేదిక పేర్కొంది.
పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ బృందం
నిర్మాణ పనుల తీరుపై పరిశీలన.. క్షేత్రస్థాయిలో 4 రోజుల పర్యటన
పోలవరం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం బుధవారం పర్యటించింది. విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్టు పరిశీలనకు రావడం ఇది ఎనిమిదో పర్యాయం. ఈ సారి నిపుణుల బృందం నాలుగు రోజులు పర్యటించనున్నట్లు ప్రాజెక్టు అథారిటీ సీఈవో సంజీవ్ వోహ్రా తెలిపారు. విదేశీ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం, కేంద్ర మట్టి రాతి పదార్థాల నాణ్యతా పరిశీలన సంఘం (సీఎస్ఎంఆర్ఎస్), వ్యాప్కోస్ అధికారులు పరిశీలనలో పాల్గొంటున్నారు. ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిశీలనకు ముందు అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రాజెక్టు సమావేశం మందిరంలో పనుల పురోగతి, తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ గౌరవ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఇంజనీరింగ్ చీఫ్ ఎన్.నరసింహమూర్తి, ఎస్ఈ పి.రామచంద్రరావు, మేఘా నిర్మాణ సంస్థ జీఎం ఎ.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ బిల్లులు అంగీకరించం
రూ.1482 కోట్ల వ్యయాన్ని తిరస్కరించిన పీపీఏ
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఖర్చు చేసినట్లుగా రాష్ట్ర జల వనరుల శాఖ పంపిన రూ.1482 కోట్ల మేరకు బిల్లుల్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తిరస్కరించింది. ఈ బిల్లులను అంగీకరించబోమని తేల్చి చెప్పింది. సత్యసాయి పైప్‌లైన్ కోసం వ్యయం చేసిన రూ.9.67 కోట్ల బిల్లులనూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ తిప్పిపంపింది. కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసిన రూ.76.29 కోట్ల బిల్లులనూ పెండింగ్‌లో పెట్టింది. టన్నెల్ సామర్థ్యాన్ని 50 శాతం పెంచేందుకు అయిన రూ.293 కోట్ల వ్యయాన్ని కూడా తిరస్కరించింది. కుడి, ఎడమ ప్రధాన కాలువకు ఖర్చు చేసిన రూ.532 కోట్ల బిల్లులనూ తిరస్కరించింది. ఎస్టాబ్లిష్మెంట్ వ్యయాలు రూ.363 కోట్లు, భూసేకరణ వ్యయం రూ.208 కోట్లు, కాలువల కోసం చేసిన ఖర్చు రూ.94 కోట్లు, వడ్డీ చెల్లింపులు ఏడాది దాటినందున రూ.22 కోట్లు, డీ పట్టా భూములు, పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.81.44 కోట్లు, పోలవరం ఫేజ్-2లో వ్యయం చేసిన రూ.10.13 కోట్లతో కలిపి మొత్తం సుమారుగా 1482 కోట్ల బిల్లుల్ని పీపీఏ తిరస్కరించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..