పుష్కరాలకు పోలవరం ‘విద్యుత్’ సిద్ధం
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:51 AM
పోలవరం ప్రాజెక్టులో జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో మరో కీలక ఘట్టానికి సోమవారం అడుగులు పడ్డాయి. తొలి యూనిట్‌లో స్టాటర్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయింది. జల విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలో అత్యంత కీలకమైన స్టాటర్ ఏర్పాటు పనులు ప్రారంభం కావడంతో తొలి యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి మరింత చేరువయ్యింది.
తొలి యూనిట్‌లో స్టాటర్ ఏర్పాటు ప్రక్రియ
రోటర్ బిగింపు పనులకూ శ్రీకారం
జలవిద్యుత్ కేంద్రంలో కీలక ఘట్టం ప్రారంభం
పోలవరం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో మరో కీలక ఘట్టానికి సోమవారం అడుగులు పడ్డాయి. తొలి యూనిట్‌లో స్టాటర్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయింది. జల విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలో అత్యంత కీలకమైన స్టాటర్ ఏర్పాటు పనులు ప్రారంభం కావడంతో తొలి యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి మరింత చేరువయ్యింది. మరోవైపు రోటర్ బిగింపు పనులూ ప్రారంభమయ్యాయి. సోమవారం ఆరంభమైన ఈ కీలక పనులను ఏపీ జెన్‌కో(హైడల్) విభాగం డైరెక్టర్ సుజయ్‌కుమార్, నిర్మాణ సంస్థ మేఘా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంగర సతీశ్ బాబు, జనరల్ మేనేజర్ ప్రసేన్‌జిత్ మజుందార్, ఏపీ జెన్‌కో సీఈలు రవీంద్రరెడ్డి, విశ్వేశ్వరరావు తదితరులు పరిశీలించారు. పోలవరం జల విద్యుత్ కేంద్రంలో మొత్తం 12 యూనిట్లుంటాయి. ఒక్కో యూనిట్‌లో 80 మెగావాట్ల చొప్పున మొత్తం 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రాజెక్టును నిర్దేశిత సమయంలో పూర్తి చేయడానికి వీలుగా సమాంతరంగా సివిల్, మెకానికల్, ఎలక్ర్టికల్ పనులను చకచకా పూర్తి చేస్తున్నారు.
పనులు వేగవంతం
పుష్కరాల ప్రారంభం నాటికి తొలి ఆరు యూనిట్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. దీనికి అనుగుణంగా మేఘా, జెన్‌కో అధికారులు సమన్వయంతో పనులను వేగవంతంగా చేస్తున్నారు. నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనులు శీఘ్రంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని మేఘా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంగర సతీశ్ తెలిపారు.
టర్బైన్ స్టాటర్ కీలకం
జలవిద్యుత్ కేంద్రంలో నీటి ప్రవాహంతో టర్బైన్ తిరిగినపుడు దానికి అనుసంధానమైన రోటర్ తిరుగుతుంది. రోటర్ చుట్టూ ఉండే స్థిర భాగమే స్టాటర్. రోటర్ తిరుగుతున్నప్పుడు స్టాటర్‌లో ఏర్పడే అయస్కాంత క్షేత్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల జనరేటర్‌లో స్టాటర్ అత్యంత కీలకమైనది. స్టాటర్ ఏర్పాటు పూర్తికావడం యూనిట్ ఎలకో్ట్ర మెకానికల్ పనుల్లో ఒక ముఖ్యమైన దశ అని అధికారులు తెలిపారు. స్టాటర్‌లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన కాయిల్స్, కోర్ వంటి కీలక భాగాలు ఉంటాయి. రోటర్, స్టాటర్ మధ్య అత్యంత కచ్చితమైన సమన్వయం ఉండేలా ఏర్పాటు చేస్తారు. యంత్ర సామర్థ్యం, విద్యుత్ ఉత్పత్తి స్థిరత్వం, దీర్ఘకాలిక పనితీరులో స్టాటర్ కీలకమైనది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం