Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు అరుదైన అంతర్జాతీయ గౌరవం.. కెంజుట్సులో అధికారిక ప్రవేశం
ABN , Publish Date - Jan 11 , 2026 | 05:53 PM
పవన్ కల్యాణ్ అత్యంత అరుదైన ఘనత సాధించారు. పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం చేశారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.
ఆంధ్రజ్యోతి, జనవరి 11: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన అసాధారణ బహుముఖ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన 'కెంజుట్సు' (Kenjutsu)లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఆయన అరుదైన చారిత్రాత్మక గుర్తింపును సాధించారు.
ఇది జపనీస్ మార్షల్ ఆర్ట్స్ చరిత్రలో భారతీయుడికి, మరింత ముఖ్యంగా తెలుగు వ్యక్తికి లభించిన అత్యంత అరుదైన గౌరవంగా నిలిచింది. మూడు దశాబ్దాలకు పైగా క్రమశిక్షణతో, అంకితభావంతో సాగించిన సాధన, పరిశోధనలకు ఫలితంగా ఈ గొప్ప గుర్తింపు లభించింది.

ప్రముఖ జపనీస్ సంస్థ సోగో బుడో కాన్రి కై(Sogo Budo Kanri Kai) నుంచి ఫిఫ్త్ డాన్ (5th Dan) గౌరవాన్ని పవన్ అందుకున్నారు. అంతేకాదు, సోకే మురమత్సు సెన్సీ నాయకత్వంలోని టకేడా షింగెన్ క్లాన్ లో జపాన్ బయట తెలుగు మాట్లాడే మొదటి వ్యక్తిగా స్థానం సంపాదించారు. ఇది చాలా అరుదుగా ఇచ్చే గౌరవం. అంతేకాదు, గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' అనే విశిష్ట బిరుదును కూడా ప్రదానం చేసింది. ఇది భారతీయ సెలబ్రిటీల్లో మొదటిసారి లభించిన టైటిల్.
ఈ సాధన మార్షల్ ఆర్ట్స్ పట్ల పవన్ కు ఉన్న లోతైన అభిరుచి, క్రమశిక్షణను మరోసారి నిరూపిస్తోంది. ఇండియా-జపాన్ సాంస్కృతిక సంబంధాలకూ ఇది గర్వకారణంగా నిలిచింది. పవన్ కల్యాణ్ ఈ అరుదైన ఘనతతో తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచారు. ఈ గౌరవం తెలుగు సినిమా, రాజకీయాలు, మార్షల్ ఆర్ట్స్ రంగాలకు కొత్త ఊపిరి పోసినట్లైంది.

పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్, కత్తిసాము ట్రైనింగ్ దృశ్యం..

ఇవీ చదవండి:
ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..
ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..