Share News

అండగా నిలవండి

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:52 AM

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు.

అండగా నిలవండి

  • కేంద్ర బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వండి

  • ఉప్పాడ తీర రక్షణ గోడకు సహకరించండి.. అమిత్‌ షాకు పవన్‌ వినతి

  • పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్‌గా అభివృద్ధి చేయాలని అశ్వినీ వైష్ణవ్‌కు విజ్ఞప్తి

  • పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులపైనా చర్చ.. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు

  • ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమావేశాలు

న్యూఢిల్లీ/అమరావతి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అండగా నిలవాలని అమిత్‌ షాను పవన్‌ కోరారు. కేంద్ర బడ్జెట్‌లో ఈ మేరకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అమిత్‌ షాను ఆయన అధికారిక నివాసంలో కలిసి.. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పరిపాలనాపరమైన అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీర కోతను అరికట్టేందుకు ప్రతిపాదించిన ‘సీ ప్రొటెక్షన్‌ వాల్‌’పై ప్రత్యేకంగా చర్చించారు. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ముందు ఈ ప్రతిపాదనను ఉంచేందుకు కాకినాడ జిల్లా పరిపాలనకు అవకాశం కల్పించాలని కోరారు. పవన్‌ ప్రతిపాదనకు అమిత్‌ షా అంగీకారం తెలిపారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినందుకు పవన్‌ ధన్యవాదాలు తెలిపారు.

మోడల్‌ రైల్వేస్టేషన్‌గా పిఠాపురం..

పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను పవన్‌ కల్యాణ్‌ కోరారు. పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమని, రైల్వే స్టేషన్‌ను అమృత్‌ స్కీం కింద మోడల్‌ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. అష్టాదశ శక్తిపీఠం, శ్రీపాద శ్రీ వల్లభస్వామి కొలువైన క్షేత్రం పిఠాపురంలో ఉన్నందున దర్శనం నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. సేతు బంధన్‌ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇది 2030 జాతీయ రైల్‌ ప్రణాళికకు అనుగుణంగా లెవల్‌ క్రాసింగ్‌లు తొలగించేందుకు, ట్రాఫిక్‌ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినందుకు పవన్‌ కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎక్స్‌ వేదికగా అమిత్‌ షా, వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jan 29 , 2026 | 04:52 AM