రెండేళ్లలో పదింతల అభివృద్ధి
ABN , Publish Date - Sep 30 , 2026 | 03:57 AM
వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వంలో కంటే ఈ రెండేళ్లలో పది రెట్లు ఎక్కువగా అభివృద్ధి పనులు జరిగాయని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లా రామాపురంలో మంగళవారం నిర్వహించిన పల్లె పండుగ 3.0 వేదికపై ఆయన మాట్లాడారు.
అప్పులకుప్పగా ఉన్న రాష్ట్రం చంద్రబాబు అనుభవంతో గట్టునపడింది
పల్లెపండుగ 3.0 కింద 11,085 కోట్లతో పనులు
ప్రజలు భాగస్వాములు కావాలి: డిప్యూటీ సీఎం
నెల్లూరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వంలో కంటే ఈ రెండేళ్లలో పది రెట్లు ఎక్కువగా అభివృద్ధి పనులు జరిగాయని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లా రామాపురంలో మంగళవారం నిర్వహించిన పల్లె పండుగ 3.0 వేదికపై ఆయన మాట్లాడారు. 2019-24 మధ్య బ్లీచింగ్ కొనడానికి కూడా పంచాయతీల వద్ద డబ్బులు లేవని, ఈ రెండేళ్ల కూటమి పాలనలో ప్రతి గ్రామం సమగ్రాభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అమేజింగ్ ఫైనాన్షియల్ స్ట్రేటజీ వల్ల మాత్రమే అభివృద్ధి సాధ్యపడింది. అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రం గట్టున పడిందంటే దానికి సీఎం అనుభవం, దక్షతలే కారణం. ఉద్యమ స్ఫూర్తితో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వామ్యులు కావాలి. ప్రతి పనినీ పరిశీలించాలి. నాణ్యత పరంగా లోపం కనిపిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి’’ అని సూచించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 880 కిమీ సీసీ రోడ్లు వేస్తే, చంద్రబాబు నాయకత్వాన ఈ ప్రభుత్వం 9వేల కిమీ సీసీ రోడ్లు నిర్మించిందని తెలిపారు. పల్లెపండుగ 1.0, 2.0లో 9వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని వివరించారు.
పల్లెపండుగ 3.0లో 11,085 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. రూ. 50వేల కోట్లతో జలజీవన్ మిషన్ వేగవంతం చేయబోతున్నామన్నారు. 1.30 లక్షల కోట్లతో జలజీవన్, అమరజీవి జలధార పథకాల ద్వారా మల్టీ విలేజ్ స్కీం, సింగిల్ విలేజ్ స్కీం పనులు చేపడుతున్నామని, అక్టోబరు 5న ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. పల్లెపండుగ 3.0 కింద ఆరువేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9వేల కిలోమీటర్ల బీటీ రోడ్లు, మరో 22,500 మినీ గోకులాలు, 50 వేల హెక్టార్లలో పండ్ల తోటలు అభివృద్ధి చేయబోతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బంజారా ఆవాసాల్లో ఈ పనులు ఒక మహాయజ్ఞంలా చేయబోతున్నామని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి ఒక డొంక రోడ్డును నిర్మిస్తామని, తరువాత మిగిలిన రోడ్లను కూడా దశలవారీగా నిర్మిస్తామని చెప్పారు.
పేదరికమే కారణం
పల్లె పండుగ 3.0కు ఉదయగిరి ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడానికి ఇక్కడి పేదరికమే కారణమన్నారు. ఇక్కడి నుంచి వలసలు తగ్గాలనే బలమైన కాంక్షతో పల్లెపండుగను ప్రారంభించామని వివరించారు. ఉదయగిరిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, హార్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తామని తెలిపారు. ఉదయగిరి కోట, దుర్గాన్ని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని, అందుకు అవసరమైన నిధులను వెంటనే కేటాయిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, ఫరూక్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ పాల్గొన్నారు.
అందరూ గర్వించేలా అభివృద్ధి : మాధవ్‌పల్లెలో నివసించే ప్రతి పౌరుడూ గర్వించేలా అభివృద్ధి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రానికి 13 జాతీయ అవార్డులు రావడం గర్వకారణమని, దానికి పవన్ కల్యాణ్ చేసిన కృషి అభినందనీయమన్నారు. గ్రామ వికాసం ఎలా చేయాలో, దాని ఆవశ్యకత ఏమిటో, కుప్పం నియోజక వర్గంలో చేసిన అభివృద్ధి ద్వారా దేశానికంతటికి చూపిన దార్శినికుడు చంద్రబాబు అని అన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి కట్టుగా గ్రామీణ వికాసానికి కృషి చేస్తున్నాయని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం