Share News

పరవాడ ఫార్మాసిటీలో కాలుష్యంపై పీసీబీ కొరడా..

ABN , Publish Date - Sep 26 , 2026 | 08:41 PM

పరవాడ ఫార్మాసిటీలో కాలుష్యంపై పీసీబీ అధికారులు కొరడా ఝళిపించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన అధికారులు.. ఫార్మా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి, శుద్ధి చేయని వ్యర్థాలను వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..

పరవాడ ఫార్మాసిటీలో కాలుష్యంపై పీసీబీ కొరడా..
Parawada Pharma City

అమరావతి, సెప్టెంబర్ 26: పరవాడ ఫార్మాసిటీలో కాలుష్యంపై పీసీబీ అధికారులు కొరడా ఝళిపించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు పరవాడ ఫార్మాసిటీలో తనిఖీలు చేపట్టారు. సామాజిక మాధ్యమాల ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా ఫార్మాసిటీ పరిధిలోని పలు ఫార్మా కంపెనీల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థాలు, నీటి నమూనాలను సేకరించి పరిశీలనకు పంపించారు. తనిఖీల్లో కొన్ని పరిశ్రమల నుంచి శుద్ధి చేయని వ్యర్థాలను వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేస్తున్నట్లు గుర్తించినట్లు పీసీబీ అధికారులు తెలిపారు.


పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాల్సి ఉండగా.. వాటిని ఉల్లంఘించినట్లు గుర్తించిన నేపథ్యంలో అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. తనిఖీల అనంతరం పరవాడ ఫార్మాసిటీ పరిధిలోని మొత్తం 95 పరిశ్రమలకు పీసీబీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాలుష్య నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయా కంపెనీలకు సూచించారు. ముఖ్యంగా ప్రమాదకర వ్యర్థాలను నిబంధనల ప్రకారం సేకరించి, శుద్ధి చేసి, సరైన విధానంలోనే నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ శుద్ధి చేయని లేదా ప్రమాదకర వ్యర్థాలను వర్షపు నీటి కాలువలు, పరిసర ప్రాంతాల్లోకి విడుదల చేయరాదని హెచ్చరించారు.


పిఠాపురం వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై పవన్ సమీక్ష

అమరావతి: పిఠాపురం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టం అంచనాల్లో ఏ రైతుకూ అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్య పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ.. వ్యాధుల వ్యాప్తి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.


ఇవి కూడా చదవండి..

ఒక ఉగ్రవాద దేశం నన్నే ప్రశ్నిస్తోందా.. పాక్ జర్నలిస్ట్‌కు జైశంకర్ ఘాటు రిప్లై..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 26 , 2026 | 09:44 PM