ఇంద్రకీలాద్రి కిటకిట
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:18 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు కనకదుర్గమ్మ శ్రీ బాలాత్రిపురసుందరిదేవిగా దర్శనమిచ్చారు.
వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
తొలిరోజే లక్ష దాటిన భక్తులు..
దేవస్థానం చరిత్రలో ఇది రికార్డు
శ్రీ బాలాత్రిపురసుందరి దేవిగా
దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడ), ఆక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు కనకదుర్గమ్మ శ్రీ బాలాత్రిపురసుందరిదేవిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 2.30 గంటలకు కవాత ఉద్ఘాటన నిర్వహించిన అనంతరం అమ్మవారికి సుప్రభాత సేవ చేశారు. మూడు గంటలకు అమ్మవారు, ఉపాలయాలమూర్తులకు స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎనిమిది గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించారు. తర్వాత విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశన, నవరాత్రి కలశ స్థాపన చేశారు.
ఘాట్‌రోడ్డుపై ట్రాఫిక్
శరన్నవరాత్రుల తొలిరోజే భక్తులు పోటెత్తడం, ఎక్కువ సంఖ్యలో వీఐపీలు రావడంతో ఉదయం కొద్ది సేపు ఘాట్ రోడ్డు రద్దీగా మారింది. వీఐపీలు వస్తున్న సమయంలో శ్రీకాళహస్తి ఆలయ పాలకవర్గ సభ్యులు, అధికారులు, సింహాచలం ఆలయ పాలకర్గ సభ్యులు, అధికారులు అయా ఆలయాల నుంచి అమ్మవారికి సారె సమర్పించేందుకు వచ్చారు. ఘాట్ రోడ్డు ప్రారంభ ద్వారం వద్ద బారికేడ్‌లు ఏర్పాటు చేసి ఉండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వీఐపీల వాహనాలు వరుసగా వస్తుండడంతో అక్కడ ఉన్న పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరించడంలో కొంత తడబాటుకు గురయ్యారు. విషయం తెలుసుకున్న చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కొండపై నుంచి కాలినడకన దిగివచ్చారు. స్వయంగా ఆయనే అరగంట సేపు అక్కడే ఉండి ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టారు.
తొలిరోజే పోటెత్తిన భక్తులు
ఈ ఏడాది శరన్నవరాత్రుల్లో విజయవాడ ఇంద్రకీలాద్రి రికార్డు సృష్టించింది. తొలిరోజు అమ్మవారి దర్శనానికి లక్షమందికి పైగా భక్తులు వచ్చారు. ఇంద్రకీలాద్రి చరిత్రలో ఈవిధంగా మొదటి రోజున భక్తులు రావడం ఇదే ప్రథమమని దేవస్థాన వర్గాలు చెబుతున్నాయి. వినాయకుడి ఆలయం నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రధానాలయం వరకు క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఏటా తొలిరోజున సాధారణంగా 50 వేల లోపు భక్తుల వస్తారు. ఈ ఏడాది ఉత్సవాల ప్రారంభం ఆదివారం రావడం, అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడం, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. సాధారణంగా మూల నక్షత్రం రోజున దర్శనానికి తండోపతండాలుగా భక్తులు రావడంతో క్యూలు నిండిన తర్వాత మిగిలిన వారిని హోల్డింగ్ పాయింట్లలో పంపుతారు. ఈ ఏడాది తొలిరోజునే హోల్డింగ్ పాయింట్లలోకి భక్తులను పంపాల్సి వచ్చింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు మూడు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మొదటి హోల్డింగ్ పాయింట్‌లో 33 కంపార్టుమెంట్లు, రెండో హాల్డింగ్ పాయింట్‌లో 24, మూడో హోల్డింగ్ పాయింట్‌లో 30 కంపార్టుమెంట్లు ఏర్పాటు చేశారు. ఆదివారం మొదటి హోల్డింగ్‌లో 25 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్