గ్రామాలకు వెళ్లండి
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:47 AM
పీజీఆర్‌ఎస్ దరఖాస్తులను ప్రజలకు సంతృప్తి కలిగేలా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో అధికారులు నెలకు నాలుగు సార్లు గ్రామాలకు వెళ్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు
చాలా సమస్యలు పరిష్కారమవుతాయి
మున్సిపాలిటీల్లోనూ ఈ ప్రక్రియ జరగాలి
కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమాచారం కోరిన లోకేశ్
అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్ దరఖాస్తులను ప్రజలకు సంతృప్తి కలిగేలా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో అధికారులు నెలకు నాలుగు సార్లు గ్రామాలకు వెళ్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. ఇకనుంచి తప్పనిసరిగా ఈ పర్యటనల వివరాలను ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీల్లోనూ ఈ ప్రక్రియ జరగాలని స్పష్టం చేశారు. ప్రతీ సోమవారం ఆర్టీజీఎస్ ద్వారా క్షేత్రస్థాయిలోని అంశాలను సమీక్షిస్తామన్నారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖలన్నీ సాంకేతికత అనుసంధానంతో పని చేయాలని ఆదేశించారు. అన్ని రంగాల్లోనూ ఏఐ డీప్ టెక్ అమలు చేయాలన్నారు. జీఎస్టీ వసూళ్లలో మాత్రమే ఏఐ డీప్ టెక్‌ను వినియోగిస్తున్నారని, మిగిలిన శాఖలూ ఈ సాంకేతికతను అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. డీప్ టెక్‌ను వినియోగించడం ద్వారా అదనపు అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. టెక్నాలజీతో రెవెన్యూ పెంచుకోవచ్చనని, సంపద సృష్టించేలా ప్రణాళికలను సిద్ధం చేయవచ్చని సీఎం పేర్కొన్నారు. డేటా లేక్‌లో కచ్చితమైన సమాచారాన్ని ఉంచేలా చర్యలు తీసుకోవాలని, దీనికోసం ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందించాలని సూచించారు.
పనిని బట్టి అధికారులకు గుర్తింపు
సమస్యలు లేని సమాజం కోసం మనమంతా కలిసి పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రతి జిల్లాకు వచ్చినప్పుడు వివిధ పౌరసేవలపై వ్యక్తమవుతున్న ప్రజాభిప్రాయాన్ని సభల్లోనే చదివి వినిపిస్తున్నానని గుర్తు చేశారు. ప్రభుత్వం అందించే సేవలతో పాటు సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూలత వ్యక్తం కావాలని చెప్పారు. లోటుపాట్లను సవరించుకోవటం ద్వారా మరింత సమర్థంగా సేవలను, సంక్షేమ పథకాల్ని అందించే అవకాశం ఉంటుందన్నారు. సరిగా పనిచేయని అధికారులను నాన్ ఫోకల్ పోస్టుల్లో కూర్చోబెట్టాలని కలెక్టర్లకు సూచించారు. స్వర్ణ వార్డు, గ్రామ కార్యాలయాలకు ఒక ఎలక్ట్రానిక్ సైకిల్ ఇవ్వాలని కలెక్టర్లకు స్పష్టంచేశారు. కొంతమందికి ఎక్కువ పని ఉంటోందని, మరికొంతమందికి చాలా తక్కువ పని ఉంటోందని. దీన్ని సరిచేసి రేషనలైజ్ చేయాలని సూచించారు.
ప్రజాప్రతినిధుల
సమాచారం ఇవ్వండి: లోకేశ్
జిల్లాల సామాజిక, ఆర్థిక నివేదికలతో పాటు సానుకూల అంశాలపైనా కలెక్టర్లు నివేదికలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధుల పట్ల ప్రజల సంతృప్తిపైనా సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం.
ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు ఫస్ట్: సీఎం చంద్రబాబు