ONGC Blowout Konaseema: బ్లోఅవుట్ ఘటన.. పరిసరాల్లోని వారు తిరిగి రావొచ్చన్న జిల్లా కలెక్టర్
ABN , Publish Date - Jan 07 , 2026 | 09:06 PM
బ్లోఅవుట్ ఘటన జరిగిన పరిసరాల్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కోనసీమ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఘటన కారణంగా ఆ ప్రాంతాలను వీడిన వారిలో 90 శాతం మంది తిరిగొచ్చారని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్‌జీసీ సైట్ నుంచి ఎగసిపడుతున్న మంటలు నేడు కాస్త అదుపులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. పరిసరాల్లోని నాలుగు గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందని అన్నారు. బ్లోఅవుట్ పరిసర ప్రాంతాల్లోని వారు తిరిగి తమ ఇళ్లకు రావొచ్చని తెలిపారు. ఆ ప్రాంతాలను వీడిన వారిలో 90 శాతం మంది ఇప్పటికే తిరిగొచ్చారని చెప్పారు. మంటల కారణంగా ఇప్పటివరకూ జరిగిన నష్టం వివరాలను కూడా అంచనా వేస్తున్నామని తెలిపారు( ONGC Blowout Fire Incident).
ఈ ఘటనపై ఓఎన్‌జీసీ డైరెక్టర్ కూడా విజయ్ సక్సేనా కూడా ఇటీవలే స్పందించారు. బ్లోఅవుట్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు వారం రోజులు పట్టొచ్చని కలెక్టర్ కూడా ఈ సందర్భంగా చెప్పారు. మూడు పైపుల ద్వారా తీవ్ర ఒత్తిడితో నీటిని వెదజల్లుతూ మంటలను అదుపుచేస్తున్నట్టు వివరించారు. ఇప్పటికే అధికారులు ఇరుసుమండలో విద్యుత్ సరఫరాను కూడా పునరుద్ధరించారు. ఇదిలా ఉంటే, బ్లోఅవుట్‌కు సంబంధించిన కారణాలపై విచారణ జరపాలని ఎంపీ హరీశ్ కోరారు. ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ నిర్వహించే ప్రతి సైట్ వివరాలూ ప్రజలకు తెలియజేయాలని స్పష్టం చేశారు. పాత గ్యాస్ పైప్‌లైన్‌లను కూడా మార్చాలని కోరారు.
ఇవీ చదవండి:
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: లోకేశ్
బాలికపై అత్యాచారం.. ఫొటోలు బయటపెడతానని బెదిరింపు