ఔటర్‌కు తొలి అడుగు
ABN , Publish Date - Oct 03 , 2026 | 03:49 AM
Amaravati Outer Ring Road, Amaravati ORR, NHAI tenders, Amaravati ORR tenders, NHAI Amaravati, Amaravati ring road project, 189.93 km ORR, Amaravati infrastructure
అమరావతి ఓఆర్‌ఆర్‌కు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు
13 వేల కోట్ల వ్యయంతో సివిల్ నిర్మాణాలకు శ్రీకారం
4 ప్యాకేజీలలో 189.93 కిలోమీటర్ల నిర్మాణం
నవంబరు 18 వరకు బిడ్లు.. 19న ఖరారు
పర్యావరణ, అటవీ క్లియరెన్సులే తరువాయి
భూ సేకరణ ఖర్చు కలిపితే 30,491 కోట్ల వ్యయం
అమరావతి ఓఆర్‌ఆర్‌కు ఎన్‌హెచ్ ఏఐ టెండర్లు
విజయవాడ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ఏపీకి గేమ్ చేంజర్ కానున్న రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) నిర్మాణానికి తొలిఅడుగు పడింది. ఓఆర్‌ఆర్ నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లు పిలిచింది. మొత్తం 189.93 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ను రూ.13,091.75 కోట్ల వ్యయంతో చేపట్టానున్నారు. ఈ ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రాజధాని అమరావతిని పలు ప్రాంతాలకు అనుసంధానించనుంది. ఈ రహదారి నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ గురువారం టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 4 ప్యాకేజీలలో దీన్ని చేపట్టనున్నారు. డిజైన్-బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్(డీబీవోటీ), హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) విధానాలలో చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. నవంబరు 18 వరకు టెండర్లు దాఖలు చేయవచ్చు. నవంబరు 19న టెండర్లు ఓపెన్ చేస్తారు. డీబీవోటీ, హ్యామ్ విధానాల్లో టెండర్లు పిలుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణవ్యయంలో 40 శాతం నిధులను నిర్మాణ సమయం(మూడేళ్లు)లో చెల్లిస్తారు. తర్వాత 15 ఏళ్ల వరకు ఏడాదికి 2 వాయిదాలు చొప్పున మొత్తం 30 వాయిదాలలో వడ్డీతో సహా కాంట్రాక్టు సంస్థకు చెల్లిస్తారు. ఓఆర్‌ఆర్ నిర్మాణం పూర్తి కాగానే టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. టోల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 30 వాయిదాలలో చెల్లిస్తారు.
ఓఆర్‌ఆర్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోకి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలు వస్తాయి. ఈ జిల్లాల పరిధిలో మొత్తం 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా నిర్మాణం సాగనుంది. కాగా.. ఈ రహదారి అందుబాటులోకి వస్తే విజయవాడ-గుంటూరులలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: వీరులపాడు మండలంలోని పొన్నవరం, జగన్నాధపురం, తిమ్మాపురం, గూడెం మాధవరం, జుజ్జూరు, చెన్నారావుపాలెం, అల్లూరు, నరసింహారావుపాలెం, కంచికచర్ల మండలంలోని కంచికచర్ల, మున్నలూరు, మొగులూరు, పెరకలపాడు, గొట్టుముక్కల, కునికినపాడు, జీకొండూరు మండలంలోని జీకొండూరు, దుగ్గిరాలపాడు, కుంటముక్కల, గంగినేనిపాలెం, కోడూరు, నందిగామ, మైలవరం మండలం పరిధిలో మైలవరం, పొందుగల, గణపవరం గ్రామాలు ఓఆర్‌ఆర్ పరిధిలోకి వస్తాయి.
కృష్ణా జిల్లా: గన్నవరం మండలంలో సగ్గూరు(ఆమని), బూతుమిల్లిపాడు, బల్లిపర్రు, బాపులపాడు మండలంలో బండారుగూడెం, అంపాపురం, ఉంగుటూరు మండలంలోని పెద్దఅవుటపల్లి, తేలప్రోలు, వెన్నూతల, ఆత్కూరు, పొట్టిపాడు, వెల్దిపాడు, తరిగొప్పుల, బొకినాల, మణికొండ, వేంపాడు, కంకిపాడు మండలంలోని మారేడుమాక, కొణతనపాడు, దావులూరు, కోలవెన్ను ప్రొద్దుటూరు, చలివేంద్రపాలెం, నెప్పల్లి, కుందూరు, తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరు, ఉత్తరవల్లూరు, చిన్నపులిపాక, బొడ్డపాడు, దక్షిణ వల్లూరు గ్రామాలు ఉన్నాయి
ఏలూరు జిల్లా: ఆగిరిపల్లి మండలంలో బొడ్డనపల్లి, గరికపాటి వారి కండ్రిక, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లి, నరసింగపాలెం, కృష్ణవరం, సగ్గూరు, సూరవరం, కల్లటూరు గ్రామాలు ఉన్నాయి.
గుంటూరు జిల్లా: మంగళగిరి మండలంలో కాజ, చిన్న కాకాని, గుంటూరు ఈస్ట్ మండలంలో గుంటూరు, బుడంపాడు, ఏటుకూరు, గుంటూరు వెస్ట్ మండలంలో పోతూరు, అంకిరెడ్డిపాలెం, మేడికొండూరు మండలంలో సిరిపురం, వెలవర్తిపాడు, మేడికొండూరు, డోకిపర్రు, విశాదల, పేరేచర్ల, మందపాడు, మంగళగిరిపాడు, తాడికొండ మండలంలో పాములపాడు, రావెల, దుగ్గిరాల మండలంలో చిలువూరు, ఈమని, చింతలపూడి, కె.కొండూరు, తెనాలి మండలంలో కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కఠేవరం, సంగం జాగర్లమూడి, కొల్లిపర మండలంలోని వల్లభాపురం, మున్నంగి, దంతలూరు, కుంచవరం, అత్తోట, చేబ్రోలు మండలంలో గొడవర్రు, నారాకోడూరు, వేజండ్ల, సుద్దపల్లి, చేకూరు, వట్టిచెరుకూరు మండలంలో కోర్నెపాడు, అనంతవరప్పాడు, చామళ్లమూడి, కర్నూతల ఉన్నాయి.
పల్నాడు జిల్లా: పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం, పాటిబండ్ల, తాళ్లూరు, లింగంగుంట్ల, జలాల్‌పురం కంభంపాడు, కాశీపాడు, అమరావతి మండలంలోని ధరణికోట, లింగాపురం, దిడుగు, నెమలికల్లు గ్రామాలు ఓఆర్‌ఆర్ పరిధిలోకి వస్తాయి.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు