రాష్ట్రానికి భారీ పెట్టుబడి
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:16 AM
ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్ఠాత్మక భారీ ప్రాజెక్టు తరలివచ్చింది. ప్రముఖ అధునాతన మెటీరియల్స్ తయారీ సంస్థ నెక్సాన్ జియోకెమ్ రాష్ట్రంలో రూ.1,250 కోట్ల భారీ పెట్టుబడి పెడుతోంది.
కాకినాడలో రూ.1250 కోట్లతో జియోకెమ్ ప్లాంట్
ఏపీఈడీబీతో నెక్సాన్ కీలక అవగాహన ఒప్పందం
న్యూఢిల్లీ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్ఠాత్మక భారీ ప్రాజెక్టు తరలివచ్చింది. ప్రముఖ అధునాతన మెటీరియల్స్ తయారీ సంస్థ నెక్సాన్ జియోకెమ్ రాష్ట్రంలో రూ.1,250 కోట్ల భారీ పెట్టుబడి పెడుతోంది. అత్యాధునిక రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ తయారీ విభాగాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డ్డు(ఏపీఈడీబీ)తో నెక్సాన్ జియోకెమ్ ఎంవోయూ కుదుర్చుకుంది. కాకినాడ జిల్లా తొండంగి వద్ద ఈ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్టును కంపెనీ పూర్తి చేయనుంది.
మొదటి విడతలో రూ.750 కోట్లు, రెండో విడతలో మరో రూ.500 కోట్లు ఈ ప్రాజెక్టుపై ఖర్చు చేయనున్నారు. ఈ యూనిట్ ద్వారా ఏటా 600 టన్నుల అత్యంత్య నాణ్యమైన ‘సింటెర్డ్ నియోడైమియం-ఐరన్-బోరాన్’(ఎన్డీఎఫ్ఈబీ) పర్మనెంట్ మాగ్నెట్లను ఉత్పత్తి చేయనున్నారు. ఇవి ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీలు), పవన విద్యుత్ టర్బైన్లు, పారిశ్రామిక ఆటోమేషన్, కీలకమైన రక్షణ రంగ పరికరాల తయారీలో ఉపయోగపడనున్నాయి. క్లిష్టమైన ఖనిజాల విషయంలో దేశీయంగా బలమైన మౌలిక వనరులను అభివృద్థి చేయడం, ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు నెక్సాన్ జియోకెమ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ చౌదరి తెలిపారు. దేశీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక ఇంధన భద్రతను పటిష్ఠం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..