Share News

గంజాయి సాగు పాత నేరస్థుడి పనే!

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:19 AM

నెల్లూరు జిల్లా దుత్తలూరులో గంజాయి సాగు పాత నేరస్థుడి పనే అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు గంజాయి సాగు చేపట్టాడని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు.

గంజాయి సాగు పాత నేరస్థుడి పనే!

  • దుత్తలూరులో డ్రిప్‌ ఇరిగేషన్‌తో పెంపకం

  • పరిశీలించిన నెల్లూరు ఎస్పీ ఆరుగురి అరెస్ట్‌.. ముగ్గురు పరారీ

దుత్తలూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా దుత్తలూరులో గంజాయి సాగు పాత నేరస్థుడి పనే అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు గంజాయి సాగు చేపట్టాడని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. దుత్తలూరు సమీపంలో రెండెకరాల్లో సాగులో ఉన్న గంజాయి మొక్కలను శుక్రవారం ఉదయాన్నే ఎస్పీ అజిత, ఇతర అధికారులు పరిశీలించారు. కోర్టు అనుమతితో 1,731 గంజాయి మొక్కలను పెకలించి దహనం చేశారు. పోలీసు-కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌కు అందిన సమాచారం మేరకు ఉదయగిరి సర్కిల్‌, కావలి సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారులు, దుత్తలూరు తహసీల్దారు సమక్షంలో గురువారం ఈ ఆపరేషన్‌ నిర్వహించారు.

దుత్తలూరు గ్రామశివారులో సర్వే 1582-2లో సుమారు రెండెకరాల్లో మూడు నెలలుగా డ్రిప్‌ ద్వారా నీటి తడులు అందిస్తూ సాగు చేస్తున్న 1,731 గంజాయి మొక్కలను డ్రోన్‌ సాయంతో గుర్తించారు. అక్కడున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దుత్తలూరుకు చెందిన ఉప్పలపాటి సుబ్బారెడ్డి, మల్లవరపు మనోహర్‌, గోపవరపు రాజాతోపాటు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాకు చెందిన కిముడు బుచ్చిబాబు, జడ్డి జీవన్‌, తీగల బాలరాజు అరెస్టయిన వారిలో ఉన్నారు. మరో ముగ్గురు పరారయ్యారని, వారికోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సుబ్బారెడ్డి గతంలో డ్రైవర్‌గా, కాంట్రాక్టర్‌గా, వ్యాపారిగా పని చేసి ఆర్థిక నష్టాలు, అప్పుల కారణంగా గంజాయి అక్రమ రవాణాలోకి ప్రవేశించినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఈగల్‌ ఎస్పీ కేఎం మహేశ్వరరాజు, కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్‌ పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 04:19 AM