బంగారం కోసం వెళ్లి.. గనిలో ఇరుక్కుపోయాడు!
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:19 AM
శ్రీసత్యసాయి జిల్లా రామగిరి సమీపంలోని గనుల్లో బంగారం దొరుకుతుందని యూట్యూబ్‌లో చూసిన ఓ వ్యక్తి, అత్యాశకుపోయి..
సొరంగంలో ప్రాణాపాయ స్థితిలో నెల్లూరు వాసి
కాపాడిన పోలీసులు, స్థానికులు.. శ్రీసత్యసాయి జిల్లా రామగిరిలో ఘటన
రామగిరి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా రామగిరి సమీపంలోని గనుల్లో బంగారం దొరుకుతుందని యూట్యూబ్‌లో చూసిన ఓ వ్యక్తి, అత్యాశకుపోయి గని సొరంగంలో ఇరుక్కుపోయాడు. చివరకు పోలీసులు, స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రామగిరిలో కొన్నేళ్ల కిందట మూతబడిన ఈ గనుల్లోని రాళ్లలో బంగారం ఉంటుందని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ప్రభాకర్‌రెడ్డి యూట్యూబ్‌లో చూశాడు. బంగారంపై ఆశతో అదే జిల్లా పల్లెపాలెం గ్రామానికి చెందిన క్రిష్ణయ్యతో కలిసి సోమవారం రాత్రి గనుల వద్దకు చేరుకున్నాడు. గనుల్లోకి దిగేందుకు ఒక తాడు, లోపల నీరు ఉంటే మునిగిపోకుండా ఓ ట్యూబును, చీకట్లో బంగారాన్ని గుర్తించేందుకు టార్చిలైటును వెంట తీసుకెళ్లారు. ప్రభాకర్ రెడ్డి నడుముకు తాడు కట్టుకుని గనుల్లోకి దిగాడు.
ఈ క్రమంలో చేతులకు బొబ్బలెక్కి తిరిగి బయటకు రాలేకపోయాడు. ప్రాణాపాయ స్థితిలో కేకలు వేశాడు. అతన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించిన క్రిష్ణయ్య, చేతకాక రామగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే గనుల వద్దకు చేరుకుని పరిశీలించారు. ప్రభాకర్ రెడ్డిని బయటకు లాగేందుకు ప్రయత్నించి, సాధ్యంకాక స్థానికులను రప్పించారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ లోగా విద్యుత్‌శాఖ కార్యాలయంలోని తాడు సాయంతో స్థానికులు ప్రభాకర్ రెడ్డిని బయటకు తీశారు. బంగారంపై ఆశతో వచ్చామని, ప్రాణాలు పోయినంతపనైందని ప్రభాకర్ రెడ్డి వాపోయాడు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని, గనుల్లోకి ఎవరూ చొరబడకుండా శ్లాబ్ వేయాలని స్థానికులు అధికారులను కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత