ఏపీలో నక్సలిజం ఎండ్‌కి వచ్చింది: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:58 PM
ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సోమవారం విజయవాడలో మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మార్చి 31వ తేదీలోగా నక్సల్స్ లొంగిపోవాలని కేంద్రం ఆదేశించిందని, ఈ రోజు(సోమవారం)తో ఏపీలో నక్సలిజం ఎండ్‌కి వచ్చిందని డీజీపీ అన్నారు.
అమరావతి, మార్చి 30: మావోయిస్ట్ ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు ఆదివారం ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. నారాయణరావుతో పాటు ఏఓబీ స్పెషల్ జోనల్, ఏరియా, డివిజనల్ కమిటీకి చెందిన పలువురు సభ్యులు కూడా లొంగిపోయారు. వారు తమ ఆయుధాలను పోలీసులకు స్వాధీనం చేశారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సోమవారం విజయవాడలో మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మార్చి 31వ తేదీలోగా నక్సల్స్ లొంగిపోవాలని కేంద్రం ఆదేశించిందని, ఈ రోజు(సోమవారం)తో ఏపీలో నక్సలిజం ఎండ్‌కి వచ్చిందని డీజీపీ అన్నారు.
కేంద్రం హెచ్చరికల తర్వాత చాలా మంది నక్సల్స్ లొంగిపోయారని చెప్పారు. జనజీవన స్రవంతిలో కలవాలని తాము నక్సల్స్‌కు పిలుపు ఇచ్చామని తెలిపారు. నేడు తొమ్మిది మంది వరకు నక్సలైట్లు తమ వద్ద లొంగిపోయారని వెల్లడించారు. 36 ఏళ్లుగా నక్సల్స్ ఉద్యమంలో పని చేసిన నారాయణ రావుతో పాటు తొమ్మిది మంది లొంగిపోయారన్నారు. అరెస్ట్ అయిన వారిలో పోడియం రాజే, కర్తం ఆడమే, ముచ్చిక మాస, మడవి జోగి, ముచ్చిక లక్ష్మణ్, కడితి హుర్రే ఉన్నారని తెలిపారు.
ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘చెల్లూరి నారాయణ రావుపై రూ. 25 లక్షలు.. కర్తం లచ్చుపై రూ. 5 లక్షలు.. పోడియం రాజే, ముచ్చిక మాస, మడవి జోగి, కర్తం ఆడమేలపై రూ. 4 లక్షలు (ఒక్కొక్కరిపై).. మాదివి అడామా, ముచ్చిక లక్ష్మణ్, కడితి హుర్రేలపై రూ. 1 లక్ష (ఒక్కొక్కరిపై) చొప్పున రివార్డు ఉంది. ఆ మొత్తం వారికి లభిస్తుంది. తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.20,000 అందజేస్తాం. ఇటీవల జరిగిన ఎదురు కాల్పుల్లో 18 మంది నక్సల్స్ చనిపోయారు. కృష్ణా, ఏలూరు, ఎన్‌టీఆర్ కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో నేరాలకు పాల్పడేందుకు వచ్చిన అజ్ఞాత మావోయిస్టు దళాల కుట్రలను ఏపీ పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో 50 మంది దళ సభ్యులను అరెస్టు చేశాం. ఇప్పుడు ఏపీ నక్సల్స్ ఫ్రీ రాష్ట్రం అని గొప్పగా చెబుతున్నాం. గణపతి మన రాష్ట్రంలో లేరు. ఇతర రాష్ట్రాల గురించి నేను మాట్లాడను’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇల్లు ఇలా తుడిస్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట
వావ్.. సూపర్ ఐడియా.. పులి బొమ్మను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా..