Share News

కలసికట్టుగా పోరాడుదాం

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:06 AM

అందరూ కలసికట్టుగా పోరాడుదామని, 2029లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం వచ్చే విధంగా పనిచేయాల్సిన అవసరముందని పార్టీ శ్రేణులకు టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ పిలుపునిచ్చారు...

కలసికట్టుగా పోరాడుదాం

  • 2029లో మళ్లీ కూటమి ప్రభుత్వం రావాలి

  • పనిచేసి ప్రజల మనసులను గెలుచుకుందాం

  • తెలుగుజాతి కోసం అహర్నిశలూ కృషి చేస్తా

  • వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి బాధ్యత పెంచింది

  • పార్టీ శ్రేణుల త్యాగాలతోనే ఈ స్థాయికి వచ్చా

  • ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలబడతా

  • పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళదాం

  • వైసీపీ సినిమా విధ్వంసం.. టీడీపీ సినిమా అభివృద్ధి

  • నూతన కార్యవర్గ ప్రమాణ కార్యక్రమంలో లోకేశ్‌

అమరావతి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): అందరూ కలసికట్టుగా పోరాడుదామని, 2029లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం వచ్చే విధంగా పనిచేయాల్సిన అవసరముందని పార్టీ శ్రేణులకు టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరిద్దామని, వారి మనసులను గెలుచుకుందామని అన్నారు. అహంకారంతో పోతే మనకూ వైసీపీకి జరిగినట్టే జరుగుతుందని హెచ్చరించారు. మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనందరి సహకారం చాలా అవసరమని, పొత్తు ధర్మం అందరం పాటించాలని కోరారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేశ్‌ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. నాయకులు, కార్యకర్తల త్యాగాల వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని అన్నారు. 44 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో చిన్న వయసులోనే తనకు ఈ అవకాశం ఇచ్చారని, ఇది తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. తెలుగుజాతి కోసం అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. ‘దేశ రాజకీయాల్లో టీడీపీ ఒక ప్రభంజనం. టీడీపీకి గల్లీ పాలిటిక్స్‌ తెలుసు. ఢిల్లీ పాలిటిక్స్‌ తెలుసు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా పార్టీ శ్రేణులు వెనకడుగు వేయలేదు. అలాగని గెలిచినప్పుడు కాలర్‌ ఎగరేసుకుని తిరగలేదు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరించిన పార్టీ తెలుగుదేశం. యువగళం పాదయాత్రలో పార్టీ శ్రేణులను కలుసుకుని వారి సమస్యలు విన్నాను. వాటన్నింటినీ ఇప్పుడు పరిష్కరించే సమయం వచ్చింది. ఇది నా ఒక్కడి బాధ్యతే కాదు. వేదికపై ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యులు, వేదిక ముందున్న నాయకులందరిదీ. నేను ఒక్కడినే ఏదైనా చేయగలనన్న అహంకారం నాకు లేదు. కలిసికట్టుగానే ఏదైనా సాధించగలమని నేను బలంగా నమ్ముతాను. కార్యకర్తలకు నిరంతరం అండగా నిలబడటమే నా లక్ష్యం. ఐదేళ్లు నరకం అనుభవించాం. ఇక్కడున్న ప్రతి నాయకుడిపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. వారందరి శ్రమ ఫలితమే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను’ అని లోకేశ్‌ అన్నారు.


పార్టీ సిద్ధాంతాలే మన బలం

‘టీడీపీ 44 ఏళ్ల ప్రయాణంలో ఎన్నోసార్లు పడ్డాం.. లేచాం.. ఎప్పుడూ అధైర్యపడలేదు. దానికి ప్రధాన కారణం మన పార్టీ సిద్ధాంతాలే. ఎన్టీఆర్‌ ఆశయాలను కొనసాగించుకుంటూనే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం 6 శాసనాలను రూపొందించుకున్నాం. తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో-సామాజిక న్యాయం, అన్నదాతకు అండగా, కార్యకర్తే అధినేత.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అందరం పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేయాలి. కార్యకర్తల సంక్షేమం నా బాధ్యత. వారికి ఎల్లవేళలా అండగా నిలబడతా’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు.

ప్రభుత్వం కొనసాగడం చాలా ముఖ్యం

ప్రభుత్వం కొనసాగడం చాలా ముఖ్యమని లోకేశ్‌ అన్నారు. గుజరాత్‌, ఒడిశాలాంటి రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం వరుసగా ఉండటం వల్ల ఆయా రాష్ట్రాలు అభివృద్ధి చెందాయన్నారు. ‘గడిచిన ఐదేళ్లు చాలా నష్టపోయాం. విధ్వంస పాలన చూశాం. అందుకే మనం అందరం కష్టపడాలి. అహర్నిశలు పోరాడాలి. 2029లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌ నడుస్తోంది. త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తాం. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రానికీ పార్లమెంటు సాక్షిగా ఇదీ రాజధాని అని చెప్పలేదు. ఒక్క అమరావతి విషయంలోనే చెప్పారు. కేంద్రంలో మన ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. పోలవరానికి నిధులు తీసుకొచ్చాం. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో పవనన్న అండగా నిలిచారు. కనీసం 15 ఏళ్లు ఎన్డీయే ప్రభుత్వం కొనసాగాలని పవనన్న స్పష్టంగా చెప్పారు’ అని లోకేశ్‌ అన్నారు.

జగన్‌ది బెం..తా..హై..

‘మన రాష్ట్రంలో క్రెడిట్‌ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నారు. సారీ.. మన రాష్ట్రంలో కాదు.. బెంగళూరులో ఉంటారాయన. ఇప్పుడు ఆయనది బెం..తా..హై. అంటే.. మూడు రోజులు బెంగళూరులో, మూడు రోజులు హైదరాబాద్‌లో, ఒక రోజు తాడేపల్లిలో ఉంటారు’ అని వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ‘జగన్‌ రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా తీసుకురారు. ఒక్క పనీ పూర్తి చేయరు. మనం తీసుకొస్తే తామే చేశామంటారు. గూగుల్‌కు భూములు కేటాయించొద్దని వైసీపీ ఎంపీనే కోర్టులో పిల్‌ వేశారు. మళ్లీ ఇప్పుడు గూగుల్‌ తామే తెచ్చామని చెబుతున్నారు. వైసీపీ చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టలేకపోవడంలో మనందరి బాధ్యత ఉంది. క్రెడిట్‌ చోరీ డిజార్డర్‌ ఉన్న వ్యక్తి ఇంకా అనేక అబద్ధాలు చెబుతారు. ప్రజలను మభ్యపెడతారు. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అని అన్నారు.


సంక్షేమం.. అభివృద్ధి జోడెద్దుల బండి

‘గడిచిన రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల బండిలా నడిపిస్తున్నాం. మనం అందిస్తున్న సంక్షేమం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. మనం ఇస్తున్నంతగా పెన్షన్‌ను ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఠంచనుగా ఒకటో తేదీనే అటు పింఛన్లను.. ఇటు ఉద్యోగులకు జీతాలను అందిస్తున్నాం. పెట్టుబడుల్లోనూ ఏపీని నంబర్‌ వన్‌గా నిలబెట్టాం. దేశానికి వంద రూపాయలు పెట్టుబడి వస్తే అందులో మన రాష్ట్రానికే రూ.25 పెట్టుబడులు వచ్చాయి. మనది గూగుల్‌ అయితే వైసీపీది గొడ్డలి బ్రాండ్‌. గూగుల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌, రెన్యూ, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, రిలయన్స్‌.. ఇలా చెప్పుకొంటూ పోతే 800 ముఖ్యమైన ప్రాజెక్టులను మన రాష్ట్రానికి తీసుకొచ్చాం. వాటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన గ్రౌండ్‌ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

పార్టీనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది

‘మై టీడీపీ యాప్‌ ద్వారా పనిచేసే కార్యకర్తలు, నేతలను గుర్తిస్తున్నాం. పార్టీ శ్రేణులు తాము చేసే ప్రతి కార్యక్రమం మైటీడీపీ యాప్‌ ద్వారా పార్టీకి తెలియజేస్తే.. ప్రజల చుట్టూ తిరిగి వారి సమస్యలను పరిష్కరించే నాయకులను పార్టీనే వెతుక్కుంటూ వస్తుంది. గదుల్లో కూర్చుని పనిచేస్తే పార్టీ ఆశయాలను సాధించలేమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. మన పార్టీలో అలక అనే జబ్బు ఉంది. అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమే. చిన్న కుటుంబంలో కూడా విభేదాలు ఉంటాయి. కలిసి కూర్చుని చర్చించుకుంటే అన్నీ పరిష్కారం అవుతాయి. పార్టీలో సంస్కరణల కోసం నేను ఎంతో పోరాడాను. దాని ఫలితమే... మండల పార్టీ అధ్యక్షురాలు, క్లస్టర్‌ ఇన్‌చార్జి ఈ రోజు పొలిట్‌బ్యూరోలో కూర్చున్నారు. ఈ ఘనత మన అధినేత చంద్రబాబుదే’ అని తెలిపారు.

నాయకులను తయారు చేద్దాం

ఈ భూమిపై ఎవరూ శాశ్వతం కాదని, టీడీపీ అనే వ్యవస్థ శాశ్వతమని లోకేశ్‌ అన్నారు. పార్టీని బలోపేతం చేయాలంటే బలమైన నాయకులను తయారు చేయాలని, సామాన్య కార్యకర్తను నాయకుడిగా తయారు చేద్దామని అన్నారు. ఈ రోజు పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీల్లో పదవులు పొందిన వారందరినీ జల్లెడ పట్టి మరీ ఎంపిక చేశామని చెప్పారు. వారి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 04:06 AM