తలసేమియా బాధితులకు అండ
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:41 AM
‘రక్తదానం మరో మనిషికి జీవితాన్ని అందించే గొప్ప సేవ. తలసేమియాతో బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు ప్రజలు, వివిధ సంస్థలు ముందుకురావాలి’ అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పిలుపు
విజయవాడలో తలసేమియా కేర్ సెంటర్, రక్తనిధి కేంద్రం ప్రారంభం
విజయవాడ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ‘రక్తదానం మరో మనిషికి జీవితాన్ని అందించే గొప్ప సేవ. తలసేమియాతో బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు ప్రజలు, వివిధ సంస్థలు ముందుకురావాలి’ అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. శుక్రవారం విజయవాడలోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన తలసేమియా కేర్ సెంటర్, రక్తనిధి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా ప్రజలకు భరోసా కల్పిస్తూ, సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.
గత 29 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇంకా చేయాల్సిన సేవ ఎంతో ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సంజీవని ద్వారా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మొబైల్ వాహనాలతో ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ సుజల ద్వారా పలు గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. రక్తదాతల మంచి మనసు ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ ట్రస్ట్తో చేతులు కలపాలని భువనేశ్వరి కోరారు. అంతకుముందు ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు, అక్కడ ఏర్పాటు చేసిన వైద్య యంత్రాలు, సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు