శ్రీచరణ్‌పై హత్య కేసు
ABN, Publish Date - Jun 22 , 2026 | 06:06 AM
ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఈ నెల 14న అనుమానాస్పదంగా మృతిచెందిన విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాధాగాయత్రి కేసులో ఆమె భర్త శ్రీచరణ్ సోమయాజులుపై ముస్సోరీ పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.
రాధాగాయత్రి తండ్రి ఫిర్యాదుతో ముస్సోరిలో నమోదు
సింహాచలంలోని హోటల్ నుంచి అర్ధరాత్రి పరారైన శ్రీచరణ్
విశాఖపట్నం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఈ నెల 14న అనుమానాస్పదంగా మృతిచెందిన విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాధాగాయత్రి కేసులో ఆమె భర్త శ్రీచరణ్ సోమయాజులుపై ముస్సోరీ పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. మృతురాలి తండ్రి పారుపూడి సుధాకర్ ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్ సెక్షన్ 103(1) కింద శనివారం ఎఫ్‌ఐఆర్ జారీచేశారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీచరణ్ సింహాచలంలో బసచేసిన హోటల్ రూమ్ నుంచి అర్ధరాత్రి పరారైనట్టు ప్రచారం జరుగుతోంది. విశాఖలోని చినముషిడివాడకు చెందిన రాధాగాయత్రి (27)కి విశాఖ నగరానికే చెందిన శ్రీచరణ్‌తో గతేడాది నవంబరులో వివాహమైంది. ఈ నెల 13న ఇద్దరూ విహరయాత్ర కోసం ముస్సోరి వెళ్లి అక్కడ ఒక హోమ్‌స్టేలో బసచేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున రాధాగాయత్రి హోమ్‌స్టేలోనే అనుమానాస్పదంగా మృతిచెందింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతోపాటు తమ కుమార్తెను అల్లుడే హత్యచేశాడని, వివాహమైనప్పటి నుంచి అనుమానించడం, వేఽధించడం చేస్తున్నాడని ఆరోపించారు. నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని విశాఖ నగర పోలీసు అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. శ్రీచరణ్ తన భార్య మృతదేహంతోపాటే ముస్సోరి నుంచి విశాఖకు వచ్చి ఆమె అంత్యక్రియంల్లో పాల్గొన్నాడు. తర్వాత సింహాచలంలోని ఒక హోటల్‌లో బసచేశాడు. ఈ సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడుతూ... గాయత్రిని తాను హత్య చేయలేదని, పోస్టుమార్టం నివేదిక వస్తే ఆమె ఎలా చనిపోయిందనేది తెలుస్తుందని చెప్పారు.
ముస్సోరి వెళ్లి ఫిర్యాదు
ఇదిలావుండగా... తన కుమార్తె రాధాగాయత్రి మృతిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ ఆమె తండ్రి సుధాకర్ ముస్సోరి వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్తె, అల్లుడు రిషికేశ్, హరిద్వార యాత్రకు వెళుతున్నట్టు తమకు చెప్పారని, ముస్సోరికి వెళుతున్నట్టుగానీ, అక్కడ బస చేసినట్టుగానీ చెప్పలేదని అన్నారు. ఈ నెల 13వ తేదీ రాత్రి భార్యాభర్తలు సన్నిహితంగా దిగిన సెల్ఫీని అర్ధరాత్రి దాటిన తర్వాత అల్లుడు తమకు పంపించాడని తెలిపారు. తమ కుమార్తెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని, కానీ అధిక రక్తపోటు ఉన్నట్టు అతడు పోలీసులకు అబద్ధం చెప్పాడని అన్నారు. బ్యాగులో జీపీఎస్ ట్రాకర్, బెడ్‌రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మద్యం సేవించినట్టు పదేపదే చెబుతున్నాడని, ఆ మద్యంలో ఏమైనా కలిపి తమ కుమార్తెకు తాగించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ముందు 48 గంటలపాటు జరిగిన లావాదేవీలు, ఇద్దరి వాట్సాప్ చాటింగ్‌లు, హోటల్‌లోని సీసీ ఫుటేజీ, కమ్యూనికేషన్ రికార్డులను పరిశీలించాలని ఆయన పోలీసులను విజ్ఞప్తి చేశారు.
శ్రీచరణ్ పరారీ?
ముస్సోరిలో తనపై హత్యానేరం కింద కేసు నమోదైందని తెలియగానే శ్రీచరణ్ సింహాచలంలో తాను బసచేసిన హోటల్ రూమ్ నుంచి శనివారం అర్ధరాత్రి పరారైనట్టు ప్రచారం జరుగుతోంది. హోటల్ బిల్లు కూడా కట్టకుండా బయటకు వెళ్లిపోయినట్టు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు ఆయనపై కేసు నమోదు చేసిన ముస్సోరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Updated at - Jun 22 , 2026 | 06:07 AM