Share News

ప్రభుత్వ బడుల ‘స్టార్‌’ పెరగాలి

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:12 AM

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. ఏడాదిలో ‘వన్‌ స్టార్‌’ రేటింగ్‌తో ఉన్న పాఠశాలలను ‘టూ స్టార్‌’కు అప్‌గ్రేడ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ బడుల ‘స్టార్‌’ పెరగాలి

  • 2029 నాటికి అన్ని పాఠశాలలకు ‘4 స్టార్‌’

  • వెయ్యి స్కూళ్లను ‘5 స్టార్‌’కు చేర్చాలి: లోకేశ్‌

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. ఏడాదిలో ‘వన్‌ స్టార్‌’ రేటింగ్‌తో ఉన్న పాఠశాలలను ‘టూ స్టార్‌’కు అప్‌గ్రేడ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఉండవల్లిలోని నివాసంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి శాఖలపై మంత్రి సమీక్షించారు. జీరో స్టార్‌ రేటింగ్‌ ఉన్న పాఠశాలలను వన్‌ స్టార్‌ స్థాయికి అభివృద్ధి చేయాలన్నారు. 2029 నాటికి అన్ని పాఠశాలలను ‘4 స్టార్‌’కు చేర్చేలా ప్రణాళికలు రూపొందించాలని, కనీసం వెయ్యి పాఠశాలలను ‘5 స్టార్‌’కు చేర్చాలని ఆదేశించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్‌ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వన్‌ స్టార్‌లో 1685, టూస్టార్‌లో 15,618, త్రీస్టార్‌లో 19,099, ఫోర్‌ స్టార్‌లో 7172 పాఠశాలలు ఉన్నాయని మౌలిక సదుపాయాల కమిషనర్‌ రంజిత్‌ బాషా వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పురోగతి బాధ్యతలను డీఈవోలు, ఎంఈవోలు, సీఆర్‌పీలకు అప్పగించాలని మంత్రి సూచించారు. 7 వేల ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లు, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు.


ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించాలి

ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన పథకం కింద విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని లోకేశ్‌ ఆదేశించారు. ఈ ఏడాది 5 లక్షల మందికి శిక్షణ లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌, ప్రధానమంత్రి నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ పథకాలను సమర్థంగా వినియోగిం చుకోవాలన్నారు. ప్రతి నిరుద్యోగినీ నైపుణ్యం పోర్టల్‌లోకి తీసుకొచ్చి, వారికి ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆదేశిం చారు. సీడాప్‌, ఓంక్యాప్‌ల ద్వారా జర్మన్‌, జపనీస్‌ భాషల్లో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమా వేశంలో ఉన్నతాధికారులు జె.శ్యామలరావు, గణేష్‌కుమార్‌, దీవెన్‌రెడ్డి, నారాయణస్వామి పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 05:12 AM