యువగళంలో రైతుల కష్టాలు చూశా
ABN , Publish Date - Oct 03 , 2026 | 03:41 AM
‘నా యువగళం పాదయాత్రలో సీమ రైతుల కష్టాలు చూశా. అప్పుడే నా మనసులో హార్టికల్చర్ హబ్ ఆలోచన వచ్చింది. అప్పుడే (2023 జూన్ 7) కడపలో ‘మిషన్ రాయలసీమ’ ప్రకటించాను.
అప్పుడే ‘హార్టికల్చర్ హబ్’ ఆలోచన
విదేశాలకు అవసరమైన వెరైటీలు పండిద్దాం: లోకేశ్
మదనపల్లె, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘నా యువగళం పాదయాత్రలో సీమ రైతుల కష్టాలు చూశా. అప్పుడే నా మనసులో హార్టికల్చర్ హబ్ ఆలోచన వచ్చింది. అప్పుడే (2023 జూన్ 7) కడపలో ‘మిషన్ రాయలసీమ’ ప్రకటించాను. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హబ్ ప్రధాన లక్ష్యం. ఇతర రాష్ట్రాలకే కాదు.. విదేశాలకు కూడా కావలసిన వెరైటీలను ఇక్కడ పండిద్దాం. రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి తెలియజేద్దాం’ అని మంత్రి లోకేశ్ పిలుపిచ్చారు. మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (జీ హెచ్‌హెచ్), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్‌ఏ) శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ రెండూ వ్యవసాయరంగ రూపురేఖలను మార్చబోతున్నా యన్నారు. హైదరాబాద్‌లో ఐఎస్‌బీ తరహా మ్యాజిక్ ఇప్పుడు రాయలసీమలో జరగబోతోందని చెప్పారు. ‘విత్తనం నుంచి ఉత్పాదకత, కోల్డ్ స్టోరేజ్, ప్యాకింగ్, యాంత్రీకరణ, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వరకు ఇక్కడ పరిశోధన జరుగుతుంది’ అని తెలిపారు. విత్తనం దగ్గర నుంచి ప్రపంచానికి కావలసిన వెరైటీలు పండించడమే లక్ష్యమన్నారు. రైతుల ఆదాయం పెంచాలన్న అజెండాతో నాడు మిషన్ రాయలసీమ ప్రకటించానని.. ఇప్పుడు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు సహకారంతో హార్టికల్చర్ హబ్ కల నిజం కాబోతోందని చెప్పారు. లోకేశ్ ఇంకా ఏం చెప్పారంటే..
రైతు కష్టం బాబుకు తెలుసు..
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన చంద్రబాబుకు రైతు కష్టం తెలుసు. ఇప్పుడు అందరం డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాం. చంద్రబాబుకు నీటి విలువ తెలుసు కాబట్టే 1997లోనే రాయలసీమకు ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ పరిచయం చేశారు. ఆ బిందు సేద్యమే కరువు నేలను బంగారు భూమిగా మార్చింది. సబ్సిడీలో డ్రిప్ పరికరాలు అందించింది చంద్రబాబే. మొన్న ఒక ఆంగ్ల పత్రికలో చంద్రబాబు ‘వాటర్ మ్యాన్’ అని రాశారు. అది చూసి గొడ్డలి పార్టీ వాళ్లు ఏడుస్తున్నారు. వాళ్లను మూడు ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. సీమ రైతుకు వరం లాంటి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసింది ఎవరు? పట్టిసీమ ప్రాజెక్టుతో ఎటువంటి ఉపయోగం లేదన్నది ఎవరు? పోలవరం ప్రాజెక్టు మాకే అర్థం కాలేదు.. ప్రజలకు ఏమర్థమవుతుంది అన్నది ఎవరు? మీ పార్టీ నేతలు కాదా? చంద్రబాబు నీటిని దేవుడిలా, సాగునీటి ప్రాజెక్టులను దేవాలయాలుగా భావిస్తారు. సీమ ప్రాజెక్టులు ప్రారంభించింది మనమే. పూర్తి చేయబోయేదీ మనమే. అందరూ చంద్రబాబును వాటర్‌మ్యాన్ అంటున్నారు. హార్టికల్చర్ అయినా, క్వాంటమ్ అయినా చంద్రబాబు ముందుంటారు. మనం ఈరోజు గురించి ఆలోచిస్తే.. ఆయన వచ్చే 20 ఏళ్ల గురించి ఆలోచిస్తారు. దానికి ఉదాహరణే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ). ఇప్పుడు ఐఎస్‌బీ ప్రపంచంలోనే ఒక బెస్ట్ బిజినెస్ స్కూల్.
పోరాటాల పుట్టినిల్లు మదనపల్లె..
త్యాగాలు, పోరాటాల పుట్టినిల్లు మదనపల్లె. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో గాంధీజీ ఇక్కడికొచ్చినప్పుడు అత్యధికంగా విరాళాలు ఇచ్చింది మదనపల్లె ప్రజలే. బ్రిటిష్ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి లాఠీదెబ్బలు తిన్నది బీటీ కాలేజీ విద్యార్థులు. ఠాగూర్ రాసిన జనగణమన గేయాన్ని ఆంగ్లంలోకి అనువదించిందీ బీటీ కాలేజీలోనే. జనగణమనకు ట్యూన్ కట్టింది కూడా మన బీటీ కాలేజీలోనే.
బాబు-అంబానీలది మూడు దశాబ్దాల బంధం
చంద్రబాబు, అంబానీ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం మూడు దశాబ్దాల నాటిది. ధీరూభాయ్ అంబానీతో ఆయనకున్న పరిచయాలు.. ముకేశ్ అంబానీతో ఉన్న బంధం.. ఇప్పుడది మూడోతరంలో కొత్త భాగస్వామ్యంగా ఎదిగింది. ఐఎస్‌బీ వ్యాపార రంగానికి ప్రపంచ స్థాయి సంస్థలా ఎలా మారిందో.. అనంత్ అంబానీ నాయకత్వంలో ఐఎస్‌ఏ మన రైతుల కోసం ప్రపంచ స్థాయి సంస్థగా మారుతుంది. ఈ సంస్థ ఏర్పాటుకు, ఆంధ్ర రైతుల సామర్థ్యంపై పెట్టిన నమ్మకానికి అనంత్ అంబానీకి ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు