‘మేఘా’ నాలుగు ఒప్పందాలు
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:44 AM
మౌలిక వసతుల కల్పన, ఇంజనీరింగ్ రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ రాష్ట్రంలో రూ. 43,700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నాలుగు ఒప్పందాలు చేసుకుంది.
రూ. 43,700 కోట్ల పెట్టుబడులు.. 1.06 లక్షల మందికి ఉపాధి
విశాఖపట్నం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మౌలిక వసతుల కల్పన, ఇంజనీరింగ్ రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ రాష్ట్రంలో రూ. 43,700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నాలుగు ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల వల్ల 1.06 లక్షల మందికి ఉపాధి లభించనుంది. గురువారం సీఎం చంద్రబాబు, మేఘా సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి సమక్షంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఈడీబీ అధికారులతో ఆ సంస్థ ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారు.
మచిలీపట్నం పోర్టులో భారీ పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, నిరంతర గ్రీన్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ నెట్‌వర్క్, అత్యాధునిక ఫిజికల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టనున్నారు. మచిలీపట్నం పోర్టు వద్ద 150 ఎకరాల్లో రూ. 2,300 కోట్లతో నిర్మించనున్న స్టోరేజీ ట్యాంకు ద్వారా 1,500 మందికి ప్రత్యక్షంగా, 4,500 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. అదే ప్రాంతంలో రూ. 1,100 కోట్లతో ప్రాసెస్ ఎక్విప్‌మెంట్ తయారీ కేంద్రం ఏర్పాటుచేస్తారు. అక్కడ 2,500 మందికి ప్రత్యక్షంగా, 6,500 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 36 వేల కోట్లతో మూడు ప్రాజెక్టులు ఏర్పాటుచేస్తారు. వీటిలో 8,940 మందికి నేరుగా, 22,350 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని సంస్థ పేర్కొంది. రూ. 4,300 కోట్లతో ఫిజికల్ ఇంటిలిజెన్స్ హబ్ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల పది వేల మందికి ప్రత్యక్షంగా, 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని సంస్థ వెల్లడించింది.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు