విశాఖలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:19 AM
వైద్య విద్యను అభ్యసించడం ఇష్టంలేని ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా చినవాల్తేరులో సోమవారం వెలుగుచూసిందీ ఘటన. ఆంధ్ర వైద్య కళాశాల(ఏఎంసీ) అధికారులు, విశాఖ త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
వైద్య విద్య ఇష్టంలేకపోవడమే కారణం?
మృతురాలి స్వస్థలం హైదరాబాద్
మహారాణిపేట(విశాఖపట్నం), సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): వైద్య విద్యను అభ్యసించడం ఇష్టంలేని ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా చినవాల్తేరులో సోమవారం వెలుగుచూసిందీ ఘటన. ఆంధ్ర వైద్య కళాశాల(ఏఎంసీ) అధికారులు, విశాఖ త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు...తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన దారబడి శ్రావణి(27) ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. తల్లి కువైట్‌లో పనిచేస్తుండగా, సోదరి దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. శ్రావణి ఇటీవల విశాఖపట్నం వచ్చి ఏఎంసీ ఈఎన్‌టీ విభాగంలో ప్రథమ సంవత్సరంలో చేరారు. చినవాల్తేరులో ఆమె ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. తనకు పీజీ చదవాలని లేదని, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తానని, సర్టిఫికెట్లు ఇప్పించాలని శ్రావణి తాజాగా ప్రిన్సిపాల్‌ను కోరారు. దీంతో సోమవారం వస్తే సర్టిఫికెట్లు ఇస్తామని ప్రిన్సిపాల్ ఆమెకు తెలిపారు.
సర్టిఫికెట్లు తీసుకునేందుకు ఆమె సోమవారం కళాశాలకు రాకపోవడంతో మరో విద్యార్థినిని శ్రావణి ఇంటికి పంపించారు. కిటికీలోంచి చూడగా శ్రావణి ఉరివేసుకుని కనిపించడంతో కళాశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు ముందు శ్రావణి రాసినట్టుగా భావిస్తున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. తన మరణానికి బలమైన కారణం ఉందని, ఆ విషయం తనతోనే ఉంటుందని, మరెవరికీ తెలియనవసరం లేదని అందులో రాసినట్టు చెబుతున్నారు.