ఆమె ఎంబీఏ.. అతడు బీటెక్!
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:48 AM
జైలులో ఉన్న ప్రియుడిని బెయిల్‌పై బయటికి తీసుకురావడానికి అవసరమైన డబ్బు కోసం ఓ యువతి డ్రగ్స్ బాట పట్టింది. ప్రియుడి స్నేహితుడిచ్చిన తప్పుడు సలహాతో బెంగళూరులో ఎండీఎంఏను కొనుగోలు చేసి తీసుకొస్తూ ...
ప్రియుడి కోసం ‘మత్తు’ మార్గం!
బెంగళూరులో నైజీరియన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు
విజయవాడలో జీఆర్పీ, ఈగల్ పోలీసులు పట్టివేత
యువతి అరెస్టు, రిమాండ్‌కు తరలింపు
విజయవాడ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): జైలులో ఉన్న ప్రియుడిని బెయిల్‌పై బయటికి తీసుకురావడానికి అవసరమైన డబ్బు కోసం ఓ యువతి డ్రగ్స్ బాట పట్టింది. ప్రియుడి స్నేహితుడిచ్చిన తప్పుడు సలహాతో బెంగళూరులో ఎండీఎంఏను కొనుగోలు చేసి తీసుకొస్తూ విజయవాడ రైల్వేస్టేషన్లో పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను విజయవాడ జీఆర్పీ డీఎస్పీ జయసూర్య, ఈగల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర బుధవారం వెల్లడించారు. విజయవాడ పటమటలోని రెల్లి కాలనీకి చెందిన నాగసౌమ్య(21) ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో దూరవిద్యా విధానంలో ఎంబీఏ చదువుతోంది. రాణిగారితోటకు చెందిన వెంకట కాశీవర్ధన్ బీటెక్ చదువుతున్నాడు. వీరిద్దరి మధ్య ఇంటర్ నుంచే ప్రేమాయణం నడుస్తోంది. బషీర్ అనే స్నేహితుడి ద్వారా కాశీవర్ధన్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. తర్వాత నాగసౌమ్యకూ అలవాటు చేశాడు. బషీర్ బెంగళూరులోని యలహంకలో ఓ నైజీరియన్ వద్ద నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి తీసుకొచ్చేవాడు. జూలైలో కాశీవర్ధన్ కూడా యలహంక నుంచి ఎండీఎంఏ డ్రగ్‌ను విజయవాడకు తీసుకొస్తుండగా చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం అతడు చిత్తూరు జిల్లా జైల్లో ఉన్నాడు.
పోలీసుల అదుపులో స్నేహితుడు?
బెంగళూరులోని యలహంకలో నైజీరియన్ నుంచి ఎండీఎంఏను కొనుగోలు చేసే అనుభవం ఉండడంతో సౌమ్య ద్వారా డ్రగ్‌ను రప్పించడానికి బషీర్ స్కెచ్ వేశాడు. జైల్లో ఉన్న కాశీవర్ధన్ను బెయిల్‌పై బయటికి తీసుకురావడానికి డబ్బులు అవసరమని, బెంగళూరు నుంచి డ్రగ్‌ను తీసుకొస్తే దాన్ని విక్రయించి ఆ డబ్బులతో బయటకు తీసుకొద్దామని ఆమెకు చెప్పాడు. ఇలా తీసుకొచ్చినందుకు ప్రతిఫలంగా రూ.50 వేలు ఇస్తానని ఆశ చూపించాడు. యలహంకలో నైజీరియన్ చిరునామా ఇచ్చి సౌమ్యను అక్కడికి పంపాడు.
ఆమె 12వ తేదీన రైలులో బెంగళూరు వెళ్లింది. ఆమెకు బషీర్ రూ.1.03 లక్షలు ఇచ్చాడు. ఆమె నైజీరియన్ నుంచి 110 గ్రాముల ఎండీఎంఏను కొనుగోలు చేసి, లక్ష రూపాయలు ఇచ్చింది. మిగిలిన రూ.3 వేలను సౌమ్య ఖర్చు చేసింది. వాస్తవానికి ఈ 110 గ్రాముల డ్రగ్ విలువ రూ.11 లక్షలు. మిగిలిన రూ.10 లక్షలను బషీర్ ఇన్‌స్టా ద్వారా నైజీరియన్‌కు పంపినట్టు పోలీసులు గుర్తించారు. నైజీరియన్ నుంచి డ్రగ్ తీసుకున్న తర్వాత సౌమ్య బెంగళూరు - హౌరా ఎస్ఎంవీటీ రైలులో విజయవాడకు వచ్చింది. ఆరో నంబరు ప్లాట్‌ఫాంపై దిగింది. మొదటి ఫుట్ఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులను చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించింది. ఆమెను పట్టుకుని, బ్యాగ్‌ను తనిఖీ చేయగా 110 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను గుర్తించారు. ఆమెను డ్రగ్ కిట్ ద్వారా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. సౌమ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అనంతరం బషీర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..