Share News

వామ్మో.. స్లీపర్‌..!

ABN , Publish Date - Mar 27 , 2026 | 05:26 AM

మార్కాపురం జిల్లాలో గురువారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ పమాదంతో స్లీపర్‌ బస్సుల్లో భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

వామ్మో.. స్లీపర్‌..!

  • స్లీపర్‌ బస్సుల్లో ప్రయాణం.. గమ్యం చేరే దాకా అనుమానం

  • అసలే దూర ప్రయాణం.. అందునా రాత్రి జర్నీ.. ఇలాంటి పరిస్థితుల్లో జనం ఎక్కువగా స్లీపర్‌ బస్సులనే ఎంచుకుంటున్నారు. కానీ.. ఈ స్లీపర్‌ బస్సులే మృత్యు మార్గాలుగా మారుతున్నాయి..! దేశవ్యాప్తంగా గత ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 45 ప్రమాదాలు జరిగితే దాదాపు అన్నీ స్లీపర్‌ బస్సులే. వాటిలో మన రాష్ట్రంలో జరిగిన ఘోర ప్రమాదాలు ఆరు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో, చింతపల్లిలో, తాజాగా మార్కాపురంలోనూ జరిగిన ఘోర ప్రమాదాలు పదుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో స్లీపర్‌ బస్సుల్లో ప్రయాణమంటే భయపడే పరిస్థితి నెలకొంది..!

  • రాష్ట్రంలో వరుస ఘోర ప్రమాదాలు

  • అగ్నికి ఆహుతి అవుతున్న ప్రాణాలు

  • ప్రమాద సమయంలోనే హడావుడి..

  • ఆపై పట్టించుకోని ప్రభుత్వాలు..

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మార్కాపురం జిల్లాలో గురువారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ పమాదంతో స్లీపర్‌ బస్సుల్లో భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ఇలాంటి ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరగడానికి స్లీపర్‌ బస్సు డిజైన్‌లో లోపాలే ముఖ్య కారణమని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్లీపర్‌ బస్సుల్లో 36 వరకూ బెర్తులుంటే మల్టీ యాక్సిల్‌ బస్సుల్లో 40వరకూ ఉంటాయి. ఇవి డ్రైవర్‌ వెనక నుంచి రెండు బెర్తులు అనుసంధానించి బస్సు చివరి వరకూ ఆరు వరుసలు పైనా, కిందా ఉంటాయి. బస్సుకు ఎడమ వైపు సింగిల్‌ బెర్తులు కింద ఒకటి, పైన మరొకటి ఉంటాయి. వాటి మధ్యలో ఇరుకుగా ఉండే చిన్న దారిలో నడవాలంటే ప్రయాణీకులకు ఇబ్బంది. దీనివల్ల కూడా ప్రమాద సమయంలో త్వరగా బస్సు దిగి తప్పించుకోలేన పరిస్థితి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే కిందికి దిగాలంటే డబుల్‌ బెర్తుల్లో కిటికీ వైపు ఉండే ప్రయాణీకులకు ఇటు వైపు వాళ్లు దారిస్తే కానీ సాధ్యం కాదు. అలా కాకుండా గతంలో ఉన్న డిజైన్ల (అడ్డంగా)లో బెర్తులు రూపొందిస్తే అన్నీ సింగిల్‌ ఉంటాయి కాబట్టి దిగేందుకు సులభంగా ఉంటుంది. ఈ డిజైన్‌ వల్ల బెర్తుల సంఖ్య తగ్గిపోతుందని ట్రావెల్‌ ఆపరేటర్లు అభ్యంతరాలు చెప్పడంతో వాహన తయారీ కంపెనీలు డిజైన్‌ మార్చేశాయి. దీనిపై పునఃసమీక్షించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఆపరేటర్ల కక్కుర్తి.. ప్రభుత్వాల నిర్లక్ష్యం

దేశంలోని పలు రాష్ట్రాల మధ్య తిరిగే వాహనాలకు సరిహద్దు చెక్‌పోస్టుల్లో అడ్డంకులు, పొరుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు అనుమతులు సరళతరం చేసేందుకు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆలిండియా పర్మిట్‌ విధానాలు కూడా పలు ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు రవాణా ఆదాయం కోట్లలో ఉంటుంది. ఉత్తరాదిలో తక్కువ ఉండగా.. ఈశాన్య రాష్ట్రాల్లో మరీ తక్కువగా ఉంటుంది. ఏపీలో ఒక బస్సును ఏడాది పాటు రోడ్లపై తిప్పాలంటే త్రైమాసికానికి 90వేల చొప్పున ఏటా రూ.3.60లక్షలు రవాణా శాఖకు ఆపరేటర్‌ చెల్లించాలి. అదే ఈశాన్య రాష్ట్రాలైతే ఏడాదికి ఒకసారి రూ.50 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అక్కడ రిజిస్టరైన బస్సును ఇక్కడ తిప్పడానికి ఆలిండియా పర్మిట్‌ను కేంద్రం జారీ చేస్తుంది. ఇదే అవకాశాన్ని అనుకూలంగా మలచుకున్న నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన ట్రావెల్‌ ఆపరేటర్‌ హర్షవర్ధన్‌ రెడ్డి లక్ష్యద్వీ్‌పలో బస్సు కొనుగోలు చేసి దాన్ని అరుణాచల్‌ ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించారు. అక్కడే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకుని ఏపీ-తెలంగాణ మధ్య తిప్పుతున్నారు. హర్షవర్ధన్‌ రెడ్డి ఒక్కరే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో అధిక శాతం ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఈశాన ్య రాష్ర్టాల్లోనే తమ బస్సులకు రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాల్లో రిజిస్ర్టేషన్లు చేయించుకుని ఆలిండియా పర్మిట్లు తీసుకుంటున్నారు. రిజిస్ర్టేషన్‌ ఎక్కడ చేయించినా ఆలిండియా పర్మిట్‌ తీసుకుంటే దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రైవేటు బస్సులు నడుపుకునే అవకాశం ఉంటుంది. ఏపీలో దాదాపు ప్రైవేటు వాహనాలన్నీ కూడా నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లోనే ఎక్కువుగా రిజిస్ర్టేషన్‌ చేయిస్తున్నారు. అక్కడైతే ఆలిండియా పర్మిట్‌ ఏడాదికి కాకుండా ఐదేళ్లకు కూడా ఇస్తున్నారు. ఈశాన్య రాష్ర్టాలలో రిజిస్ర్టేషన్లు చేయించుకోవటం కూడా చాలా సులభం. వాహనం లేకపోయినా వాట్సా్‌పలో కాగితాలు పంపిస్తే గంటల్లోనే రిజిస్ర్టేషన్‌ అయిపోతుంది. మన రాష్ట్రంలో నిబంధనలు కఠినంగా ఉంటాయి. మరో వైపు రవాణా శాఖ అధికారులకు లంచాలూ ఎక్కువే..! ఫలితంగా రాష్ర్టానికి వచ్చే ఆదాయం కోల్పోవడమే గాక ఆ బస్సుపై అధికారం మన రవాణా శాఖకు పూర్తి స్థాయిలో ఉండదు. ఈ క్రమంలో ప్రమాణాలు సరిగా పాటించని పొరుగు రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌ బస్సులు మన ప్రాంత ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరిగినపుడే వ్యవస్థలోని లోపాలపై చర్చలు జరుగుతుంటాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తుంటాయి. ఆ తర్వాత అంతా మామూలే.. అనేలా పరిస్థితి ఉంది.


గమ్యం దూరం.. రాత్రి ప్రయాణం..

ప్రయాణికులు గమ్యం 300 కి.మీ. పైగా ఉంటే స్లీపర్‌ బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారు. రాత్రి పడుకుని ఉదయం లేచే సమయానికి గమ్యం చేరితే ఆ రోజు ఇతర పనులు చూసుకోవడానికి అలసట లేకుండా ఉంటుందనేది వారి ఆలోచన. అయితే రాత్రంతా నిద్ర పోకుండా మేల్కొని ఉండే డ్రైవర్‌కు ఏదో ఒక రోజైనా అలసటతో నిద్ర వచ్చే అవకాశం ప్రతి వంద మందిలో 25మందికి ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఇద్దరు డ్రైవర్లను ఆపరేటర్లు నియమిస్తున్నారు. అయినా.. అర్ధరాత్రి వరకూ బస్సు నడిపే డ్రైవర్‌ మేల్కొని ఉన్నా.. ఆ తర్వాత నడిపే డ్రైవర్‌ వేకువజామున నిద్రకు ఆగలేకపోతుంటారు. ఫలితంగా ప్రమాదాలు ఎక్కువగా తెల్లవారుజామునే జరుగుతుంటాయి. కర్నూలు వద్ద స్లీపర్‌ బస్సు ప్రమాదంలోనూ బస్సు ఢీ కొట్టడంతోనే బైకు పెట్రోల్‌ ట్యాంక్‌ లీకై ఘోరం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. తాజాగా మార్కాపురంలో అతివేగంతో దూసుకొచ్చిన బస్సు టిప్పర్‌ను ఢీ కొట్టింది. దీంతో ముందు నుంచి ప్రయాణికులు కిందికి దిగలేని విధంగా డోర్‌ మూసుకు పోయింది. టిప్పర్‌ ట్యాంకు నుంచి లీకైన డీజీల్‌ వల్ల బస్సుకు మంటలు అలుముకున్నాయి. దీంతో 14 మంది సజీవ దహనమయ్యారు. స్లీపర్‌ బస్సులో పరుపులు, తెరలు సులభంగా అగ్నిని ఆకర్షిస్తాయి కాబట్టి మంటలు త్వరగా బస్సంతా వ్యాపిస్తాయి. తప్పించుకునే చాన్స్‌ తక్కువగా ఉండడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది.

ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు: ఎస్పీ

మార్కాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో బస్సు రాంగ్‌రూట్‌లో ఉన్నట్లు ఙతెలుస్తోందని, అలాగే టిప్పర్‌ కూడా రాంగ్‌రూట్‌లో ఉందని చెప్పారు. టిప్పర్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందని తెలిపారు. స్టీరింగ్‌ స్ట్రక్‌ అయిందని డ్రైవర్‌ చెప్పారని, సమగ్ర దర్యాప్తుతో వివరాల సేకరణ వేగవంతం చేసి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.


మృతుల వివరాల్లో గందరగోళం

మృతిచెందిన వారంతా పూర్తిగా కాలిపోవటంతో వారిని గుర్తించేందుకు అధికారులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల జాబితా, గాయాలతో బయటపడిన వారి సమాచారంతో మృతుల వివరాలు వెల్లడించారు. కానీ... జాబితాను పలుమార్లు మార్చారు. దీంతో గందరగోళం ఏర్పడింది. రెవెన్యూ అధికారులు ఇచ్చిన జాబితాకు, పోలీసుల జాబితాకు పొంతన లేకుండాపోయింది.

ఘటన స్థలం పరిధిపై వాదులాట

మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్లే దారిలో రాయవరం దాటిన తర్వాత బస్సు ప్రమాదం జరిగింది. ఈ స్థలం మార్కాపురం మండల పరిధిలోకి వస్తుందా.. తర్లుపాడు పరిధిలోకి వస్తుందా? అంటూ రెవెన్యూ అధికారులు ఉదయాన్నే కొద్దిసేపు వాదులాడుకున్నారు. ఘటన స్థలంలో జియోట్యాగ్‌ పెట్టుకుని మరీ హద్దులు చూసుకుంటూ ‘‘ఇది నా పరిధి కాదు.. నీదే’’నంటూ వాదనలకు దిగారు. ఇది గమనించిన ఉన్నతాధికారులు మందలించడంతో మౌనంగా ఉన్నారు. తర్వాత ఆ స్థలం మార్కాపురం రూరల్‌ పరిధిలోకి వచ్చినట్టు నిర్ధారించారు.

బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్ర్భాంతి

బస్సు ప్రమాద దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలు, ప్రార్థనలు ఆత్మీయులను కోల్పోయినవారితోనే ఉంటాయని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని రాష్ట్రపతి ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఆత్మీయులను కోల్పోయిన వారికి ఎక్స్‌ వేదికగా సంతాపం తెలిపిన ప్రధాని.. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని తెలిపారు.

Updated Date - Mar 27 , 2026 | 05:26 AM