Share News

100శాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN , Publish Date - May 21 , 2026 | 04:37 AM

ఇటీవల వచ్చిన ఫలితాలు కొంతమేరకు నన్ను సంతృప్తి పరిచాయి. వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తేనే విద్యా శాఖ మంత్రిగా నాకు సంతృప్తి. అభ్యసన ఫలితాలపై అందరూ దృష్టి పెట్టాలి.

100శాతం ఉత్తీర్ణత సాధించాలి

  • అప్పుడే విద్యా మంత్రిగా నాకు సంతృప్తి.. విద్యార్థులను సొంత పిల్లలుగా భావించండి

  • ప్రభుత్వ బడులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి

  • డీఈవోలు, ఏపీసీల సమావేశంలో లోకేశ్‌

అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): ‘ఇటీవల వచ్చిన ఫలితాలు కొంతమేరకు నన్ను సంతృప్తి పరిచాయి. వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తేనే విద్యా శాఖ మంత్రిగా నాకు సంతృప్తి. అభ్యసన ఫలితాలపై అందరూ దృష్టి పెట్టాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం పిల్లలకు మేలు చేయాలి. ప్రభుత్వ బడుల్లో ఉన్న విద్యార్థులను మీ సొంత పిల్లలుగా భావించి నిర్ణయాలు తీసుకోండి’ అని మంత్రి లోకేశ్‌ డీఈవోలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ బడులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని, పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేలా బోధన ఉండాలని స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో జిల్లాల విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లు, పాఠశాల విద్యా శాఖ ఆర్జేడీలు, ఇతర అధికారులతో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘మనం తీసుకునే నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. వారి భవిష్యత్తు లక్ష్యంగా మన నిర్ణయాలు ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా బడి మానేసిన(డ్రాపౌట్‌) విద్యార్థులు లక్ష మంది ఉన్నారు. అసలు పాఠశాలల్లో చేరనివారు కూడా ఉన్నారు. వారందరినీ బడుల్లోకి తీసుకురావడంపై దృష్టిపెట్టాలి. పిల్లలు పొలం పనులు చేసే పరిస్థితి రాకూడదు. గ్యారెంటీడ్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌ (ఫౌండేషనల్‌ లిటరసీ, న్యూమరసీ) కార్యక్రమాన్ని ఉద్యమంలా అమలు చేయాలి. విద్యార్థుల ఫలితాల విషయంలో ఫేక్‌ వివరాలు పెట్టొద్దు. మేం సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మీరు వాస్తవాలు చెప్పాలి. నూరు శాతం గ్యారెంటీడ్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌ సాధించాలి. ఇటీవల పాఠశాలల్లో క్లిక్కర్‌ విధానం తీసుకొచ్చాం. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తాం. తరగతికి ఒక టీచర్‌ విధానం బాగా పనిచేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10 శాతం విద్యార్థుల సంఖ్య పెంపు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు పనిచేయాలి. పదో తరగతి ఫలితాలపై ఇటీవల ప్రభుత్వ ప్రకటన జారీ చేయడం పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపింది. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదం చేసింది’ అన్నారు.


రెండేళ్లలో స్మార్ట్‌ కిచెన్‌లు

‘మధ్యాహ్న భోజనం పథకం అమలుకు కడపలో స్మార్ట్‌ కిచెన్‌లు ప్రారంభించాం. రెండేళ్లలో రాష్ట్రమంతా వీటిని ఏర్పాటు చేస్తాం. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం నిధులు వెచ్చిస్తున్నాం. విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ప్రతి పాఠశాలలో లీకులు లేని భవనాలు, తాగునీరు, టాయిలెట్లు, బెంచీలు కనీస అవసరాలుగా తప్పనిసరిగా ఉండాలి. మంగళగిరిలోని నిడమర్రు ఉన్నత పాఠశాలను ఇంటర్నేషనల్‌ స్కూలుగా తీర్చిదిద్దాం. అక్కడ అడ్మిషన్ల కోసం పెద్ద పంచాయితీ నడిచింది. స్థానిక ఎమ్మెల్యేగా నాకూ సిఫారసులు వచ్చాయి. దీంతో పరీక్ష నిర్వహించి అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పాను. పక్క నియోజకవర్గాలకు చెందిన కుటుంబాలు వారి పిల్లల చదువుకోసం మంగళగిరికి మారుతున్నారు. నెల్లూరులోనూ మంత్రి నారాయణ రెండు పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పాఠశాల ఒకటి ఉండలానేది ప్రభుత్వ లక్ష్యం’ అని లోకేశ్‌ అన్నారు.

లీప్‌ యాప్‌ ద్వారానే...

‘ఉపాధ్యాయులు బోధనపైనే దృష్టి పెట్టాలి. పరిపాలనా వ్యవహారాలు ఎంఈవోలు, డీఈవోలు చూసుకోవాలి. ఉపాధ్యాయుల సెలవుల నుంచి అన్ని రకాల పనులు లీప్‌ యాప్‌ ద్వారానే జరగాలి. త్వరలో డ్యాష్‌బోర్డును ప్రజలకు కూడా అందుబాటులో ఉంచుతాం. పాఠశాలలకు ఏఐ లెర్నింగ్‌ టూల్స్‌ అందిస్తాం. ప్రతి శనివారం వ్యాల్యూ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టాలి. సమాజంలో దారుణాలను నివారించేలా పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలి. లింగ సమానత్వంపైనా అవగాహన కల్పించాలి’ అని లోకేశ్‌ అన్నారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ మాట్లాడుతూ... ‘రెండేళ్లలో పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాం. కొంతవరకు సఫలీకృతమయ్యాం. ఈ స్థితిలో విద్యాశాఖను ఎదుగుతున్న మొక్కగా భావించి సంరక్షించుకోవాలి. లక్ష్యాల సాధనకు స్పష్టమైన సమయాన్ని నిర్దేశించుకోవాలి’ అని అన్నారు.


జిల్లాల వారీగా సమీక్ష

  • జిల్లాల వారీగా లోకేశ్‌ సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. తిరుపతి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు.

  • విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12శాతం విద్యార్థుల డ్రాపౌట్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు.

  • కృష్ణాజిల్లా పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నంలో ఎక్కువగా డ్రాపౌట్లు ఉన్నాయని, ఆరు మండలాల్లో అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయని దీనిపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు.

  • గుంటూరు జిల్లాలో గ్యారెంటీడ్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌లో వ్యత్యాసం కనిపిస్తోందని మంత్రి అన్నారు. 78శాతం పాఠశాలలు జీరో నుంచి 2స్టార్‌ రేటింగ్‌లో ఉన్నాయని వీటిపై దృష్టి పెట్టాలని సూచించారు.

  • కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరులో డ్రాపౌట్లు, అసలు బడుల్లో చేరని పిల్లలు ఎక్కువగా ఉన్నారని, దీనిపై దృష్టి సారించాలని ఆదేశించారు.


  • శ్రీకాకుళం జిల్లాలో అకడమిక్‌ స్టార్‌ పర్సంటేజ్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. తరగతికి ఒక టీచర్‌ ఇచ్చినా గ్యారెంటీడ్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌ సంతృప్తికరంగా లేకపోవడంపై మంత్రి ఆరా తీశారు.

  • కాకినాడ జిల్లాలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సగటు హాజరు తక్కువగా ఉందన్నారు. కనీస మౌలిక సదుపాయాలు, టెన్త్‌ ఫలితాలు, మధ్యాహ్న భోజనం అమలులోనూ జిల్లా వెనకబడి ఉందన్నారు. అపార్‌ ఐడీ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జిల్లా అధికారులను ప్రశంసించారు.

  • ప్రకాశం జిల్లాలో విద్యార్థుల డ్రాపౌట్స్‌పై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వలసలు వెళ్లేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

  • చిత్తూరు జిల్లాలో బాల్య వివాహాల పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. మోడల్‌ స్కూళ్లలో గ్యారెంటీడ్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌పై దృష్టి సారించాలన్నారు.

  • అల్లూరి సీతారామరాజు జిల్లాకు ప్రత్యేక పరిస్థితులున్నాయని, ఆ జిల్లాకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉన్నత డ్రాపౌట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు.

  • ఏలూరు జిల్లాలో స్లిప్‌ టెస్ట్‌ హాజరు తక్కువ ఉందన్నారు. టెన్త్‌ ఫలితాల్లో జిల్లా ఎందుకు వెనకబడిందని ప్రశ్నించారు.

  • పల్నాడు జిల్లాలో విద్యార్థుల హాజరుపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఉపాధ్యాయుల హాజరు, లీప్‌ యాప్‌ డౌన్‌లోడ్స్‌పైనా దృష్టి పెట్టాలన్నారు.

  • కర్నూలు జిల్లాలో టెన్త్‌ ఫలితాల పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది ఉత్తమ ఫలితాల సాధనకు చర్యలు చేపట్టాలన్నారు.

  • పార్వతీపురం మన్యంజిల్లాలో విద్యార్థుల హాజరు శాతం బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు.

  • పశ్చిమగోదావరిలో అకడమిక్‌ ఎక్స్‌లెన్స్‌పై దృష్టి సారించాలన్నారు. మౌలిక సదుపాయాలు, విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి బాగుందని ప్రశంసించారు.

Updated Date - May 21 , 2026 | 04:37 AM