మాకు కావాలి.. మాకు వద్దు!
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:23 AM
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు భిన్న వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై పిల్ వేసిన న్యాయవాది తాండవ యోగేశ్..
స్థానిక ఎన్నికలపై భిన్న వాదనలు
వెంటనే నిర్వహించాలి: న్యాయవాది యోగేశ్
‘సర్’ పూర్తయ్యే వరకు ఆగాల్సిందే: వైసీపీ
ఎన్నికల వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు
నిర్వహణకు మేం సిద్ధం: ఎన్నికల సంఘం
రిజర్వేషన్ వ్యాజ్యాలపై తీర్పు కోసం నిరీక్షణ
ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది: ఏజీ
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు భిన్న వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై పిల్ వేసిన న్యాయవాది తాండవ యోగేశ్.. స్థానిక ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరగా.. వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి తరఫు న్యాయవాది మాత్రం సర్ ప్రక్రియ ముగిసి.. తుది ఎన్నికల జాబితా వచ్చే వరకు వద్దని వాదించారు. న్యాయవాది తాండవ యోగేశ్ వేసిన ప్రజాహిత వ్యాజ్యం(పిల్)పై హైకోర్టులో బుధవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. అలాగే, ‘సర్’ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తర్వాతే వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి వేసిన పిటిషన్‌పై కూడా వాదనలు సాగాయి. అయితే, కోర్టు సమయం ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపడిన మరికొన్ని వ్యాజ్యాలపై వాదనలు కొనసాగించేందుకు విచారణను గురువారానికి వాయిదా వేశారు.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ‘పార్టీ ఇన్ పర్సన్’గా న్యాయవాది తాండవ యోగేశ్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలోని 13,325 గ్రామపంచాయతీలకు ఏప్రిల్ 2న, 123 పట్టణ స్థానిక సంస్థలకు మార్చి 17న పదవీకాలం ముగిసిందన్నారు. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నిర్దిష్ఠ గడువులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ)పై ఉందన్నారు.
దీనికోసం ఎస్‌ఈసీ గత ఏడాది సెప్టెంబరులోనే పురపాలక శాఖ, పంచాయతీరాజ్ శాఖకు ప్రతిపాదనలు పంపినా వారి నుంచి స్పందన రాలేదని తెలిపారు. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్, ఓటర్ల జాబితా వివాదాలతో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న వివరాలతో స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటికే స్పష్టంగా చెప్పిందన్నారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పటికే ఆరు నెలలు జాప్యం జరిగిందని, సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు.
‘సర్’ ఆధారంగానే చేపట్టాలి: లేళ్ల
లేళ్ల అప్పిరెడ్డి తరఫున తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ‘‘అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా సెప్టెంబరు 3లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ‘సర్’లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మరణించిన, నకిలీ, వలస వెళ్లిన వారి పేర్లను లక్షల సంఖ్యలో తొలగించారు. ఈ ఏడాది అక్టోబరు 3 నాటికి సర్ ప్రక్రియ ముగిసి తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. ఆ జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి. ఒక వేళ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ నామినేషన్ల ముగింపు తేదీ నాటికి ఓటర్ల జాబితాలో వచ్చే సవరణలు పరిగణనలోకి తీసుకుని అనుబంధ ఓటర్ల జాబితాను విడుదల చేసేలా ఎస్‌ఈసీని ఆదేశించండి. ఎన్నికలు నిలిపేయాలని కోరడం లేదు.’’ అని వివరించారు.