Share News

మంత్రి పార్థసారథితో ప్రాణహాని

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:57 AM

‘మంత్రి కొలుసు పార్థసారథి, వారి అనుచరుల వల్ల నాకు ప్రాణహాని ఉంది. అలా జరిగితే టీడీపీ కార్యకర్త చంద్రయ్య పాడె మోసినట్టుగా సీఎం చంద్రబాబు నా పాడె మోయాలని కోరుకుంటున్నాను’ అని ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన డాక్టర్‌ మాదల సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి పార్థసారథితో ప్రాణహాని

  • అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు

  • ఆగిరిపల్లికి చెందిన మాదల సునీత ఆరోపణలు

ఆగిరిపల్లి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘మంత్రి కొలుసు పార్థసారథి, వారి అనుచరుల వల్ల నాకు ప్రాణహాని ఉంది. అలా జరిగితే టీడీపీ కార్యకర్త చంద్రయ్య పాడె మోసినట్టుగా సీఎం చంద్రబాబు నా పాడె మోయాలని కోరుకుంటున్నాను’ అని ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన డాక్టర్‌ మాదల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఆగిరిపల్లిలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథిపై ఆరోపణలు చేశారు. ‘రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును స్థానిక టీడీపీ నాయకులు, ఆగిరిపల్లి రెవెన్యూ అధికారులు, మంత్రి పార్థసారథి తప్పుదోవ పట్టించారు. నిరుపేదలకు పీ-4లో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా ధనిక నాయీ బ్రాహ్మణులకు, అనర్హులకు పీ-4లో స్థానం కల్పించారు. పీ-4లో ఒకే కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులకు నివేశన స్థలాలను కేటాయించారు. 1942 నుంచి రిజిస్టర్‌ డాక్యుమెంట్లు ఉన్న నా భూమి ఎకరం నాలుగు సెంట్లను గయాళ భూమిగా చూపించి అనర్హులకు పట్టాలు ఇచ్చారు. దీనిపై నాకు అన్యాయం జరిగిందని అధికారులకు మొర పెట్టుకుంటుంటే కనీసం పట్టించుకోలేదు. మంత్రి పార్థసారథి అనుచరుడైన మల్లి నా భూమిలోకి ప్రవేశించి నీ అంతు చూస్తామంటూ హెచ్చరించాడు.


నాలుగు రోజుల క్రితం మంత్రి పార్థసారథి తన అనుచరులతో వచ్చి నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నా భూమి గేటు తాళాలను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. నేను 2013లో జాలిపర్తి కృష్ణయ్య నుంచి భూమిని కొనుగోలు చేశాను. ఇదే కాక నాకు వారసత్వంగా వచ్చిన భూమితో కలిపి ఎకరా నాలుగు సెంట్లు ఉంది. ప్రస్తుతం సర్వే చేయిస్తే కేవలం 80 సెంట్లు మాత్రమే ఉందని.. సదరు భూమి ప్రభుత్వ గయాళ భూమిగా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 1942లో, 1958లో రిజిస్ట్రేషన్‌ అయినా భూములను ప్రభుత్వ గయాళ భూమిగా రెవెన్యూ అధికారులు ఎలా చూపుతారు?. సదరు భూమి విషయంలో రెవెన్యూ అధికారులు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు. ఆ భూమి కనీసం నిషేధిత భూముల జాబితాలో లేదు. ఇలాంటప్పుడు అది గయాళ భూమి ఎలా అవుతుంది’ అని సునీత ప్రశ్నించారు. ఈ భూమితో పాటు నాకు ఉన్న ఇతర భూములనూ నాకు దక్కకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారని, నేటి వరకు నా గ్రామమే తనకు రక్షణగా ఉందని తెలిపారు. మంత్రి అనుచరులు కొంతమంది నన్ను చంపుతామంటూ హెచ్చరిస్తున్నారని తనకు ఏమైనా జరిగితే అందుకు బాధ్యత మంత్రి సారథి, వారి అనుచరులదేనని సునీత స్పష్టంచేశారు.

అది ప్రభుత్వ భూమే: తహసీల్దార్‌

కాగా.. ఈ విషయమై ఆగిరిపల్లి తహసీల్దార్‌ ప్రసాద్‌ను వివరణ కోరగా ఆగిరిపల్లి 83/1 సర్వే నంబరులో మొత్తం ఏడు ఎకరాలు భూమిలో మాదల వెంకటప్పయ్య అనే వ్యక్తికి 1966లో ఒక ఎకరా భూమి సెటిల్మెంట్‌ కింద ఇచ్చారని తెలిపారు. మిగతా ఆరు ఎకరాల్లో 5 ఎకరాల 65 సెంట్లులో కొంతమంది ఇళ్లు నిర్మించుకున్నారని మిగతా 35 సెంట్లు ప్రభుత్వ భూమి మిగిలి ఉందని వెల్లడించారు. ఆరోపణలు చేస్తున్నవారికి ఎలాంటి భూమి హక్కు లేదని అది ప్రభుత్వ భూమి అని తహసీల్దార్‌ స్పష్టంచేశారు.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 05:57 AM