గిట్టుబాటు ధర ఇస్తేనే భూములిస్తాం
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:46 PM
గిట్టుబాటు ధర ఇస్తేనే జియో మైసూరు గోల్డ్ మైన్స్ కంపెనీకి భూములు ఇస్తామని టీడీపీ నాయకుడు, టైలర్ల అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, రైతులు స్పష్టం చేశారు.
తుగ్గలి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గిట్టుబాటు ధర ఇస్తేనే జియో మైసూరు గోల్డ్ మైన్స్ కంపెనీకి భూములు ఇస్తామని టీడీపీ నాయకుడు, టైలర్ల అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, రైతులు స్పష్టం చేశారు. పగిడిరాయిలో గురువారం జియో మైసూరు కంపెనీకి పొలాలు ఇవ్వాలని అధికారులు రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో చెల్లించిన మొత్తం కంటే ఎక్కువ చెల్లించాలని, దాదాపు ఎకరాకు రూ.30 లక్షలు చెల్లిస్తేనే పొలాలు ఇస్తామని తెగేసి చెప్పారు. అలాగే పొలాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. పొలాలు ఇచ్చిన రైతులను కూలీలుగా పని చేసుకుంటారే తప్ప.. ఉన్నత చదువులు చదివిన వారికి కూడా మంచి ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. స్పందించిన ఆర్డీవో ఓబులేసు, తహసీల్దార్ రవి మాట్లాడుతూ.. రైతుల కోరికలను, డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అయితే పొలాలైతే కంపెనీ అభివృద్ధికి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో వీఆర్వో బ్రహ్మయ్య, రైతులు ఉన్నారు.