Share News

భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:14 AM

భక్తులకు తొలి తెలుగు పండుగగా భావించే ‘తొలి ఏకాదశి’ని శనివారం నగరంలోని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.

భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు
కర్నూలు లలితాపీఠంలో పూజలు చేస్తున్న భక్తులు

కర్నూలు కల్చరల్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): భక్తులకు తొలి తెలుగు పండుగగా భావించే ‘తొలి ఏకాదశి’ని శనివారం నగరంలోని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని సంకల్‌బాగ్‌లోగల హరిహర క్షేత్రంలో, శ్రీదేవీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తొలి ఏకాదశిని పురస్కరించుకొని వేకువ జామున సుప్రభాత సేవ, పంచామృతాభిషేకములు, విశేష పుష్పాలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సండేల్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు చెరువు వెంకట దుర్గాప్రసాద్‌, ఉపాధ్యక్షుడు కె. శ్యామసుందర్‌రావు, కోశాధికారి సీఎస్‌ ప్రసాదరావు, కార్యదర్శి నాగులవరం రాజశేఖర్‌, గౌరవ సలహాదారు టీవీ రవిచంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు. పాతనగరంలో జమ్మిచెట్టు సమీపంలోని లలితాపీఠంలో తొలి ఏకాదశి సందర్భంగా శ్రీదేవీ, గోదాదేవి సహిత వేంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అర్చనలు, మహా మంగళ హారతి నిర్వహించారు. వన్‌టౌన్‌ శ్రీగోదా విష్ణుచిత్త భక్తబృందం వారిచే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాలు , గోవిందనామాలు, సహస్ర నామార్చనలు చేశారు. వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి మణికంఠ, ధర్మకర్తలు పూడూరు లక్ష్మిరెడ్డి, రామాంజనేయులు, పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి పాల్గొన్నారు. నెహ్రూ నగర్‌లోని సత్యసాయి మందిరంలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఆలయంలోని మహాబలేశ్వర స్వామికి అభిషేకం సాయంత్రం మహిళా భక్తులతో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Updated Date - Jul 26 , 2026 | 12:14 AM