Share News

భక్తులతో కిక్కిరిసిన మంత్రాలయం

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:11 AM

ప్రముఖపుణ్యక్షేత్ర మైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన అశేష భక్తజనవాహినితో తుంగాతీరం పులకించింది.

భక్తులతో కిక్కిరిసిన మంత్రాలయం
భక్తులతో కిటకిటలాడుతున్న మద్వమార్గ్ కారిడార్

మంత్రాలయం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ప్రముఖపుణ్యక్షేత్ర మైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన అశేష భక్తజనవాహినితో తుంగాతీరం పులకించింది. వరుసగా సెలవు దినాలు, రథసప్తమి శుభదినం కావడంతో రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో మంత్రాలయం కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు అశేష భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహాదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నది తీరం భక్తులతో కోలాహలంగా మారాయి. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సీఐ రామాంజులు, ఎస్‌ఐ మల్లికార్జున, పోలీసులు, శ్రీమఠం సెక్యూరిటీ ఆధ్వర్యంలో శ్రీమఠం మధ్వమార్గ్‌ ప్రాంగణంలో క్యూలైన్లు అధనంగా ఏర్పాటు చేశారు. ప్రసాదాల కొరత రాకుండా మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేశ్‌ జోషి, సురేశ్‌ కోణాపూర్‌ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాధారణ దర్శనానికి ఐదు గంటలు సమయం పట్టింది. మఠం ప్రాంగణంలో తొక్కిసలాట జరగకుండా మేనేజరు ఎస్‌కే శ్రీనివాసరావు, ఐపీ నరసింహమూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఊహించని రీతిలో భక్తులు సొంతవాహనాల్లో రావడంతో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. హైవే రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్‌ చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:11 AM