హమాలీల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:51 PM
సివిల్ సప్లయ్ హమాలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కేఎండీ గౌస్, పి. వెంకటలింగం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తోటమద్దులు కోరారు.
నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): సివిల్ సప్లయీస్ హమాలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కేఎండీ గౌస్, పీ వెంకటలింగం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తోటమద్దులు కోరారు. ఈ మేరకు బుధవారం ఏపీ సివిల్ సప్లయీస్ హమాలీ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఏపీ సివిల్ సప్లయీస్ హమాలీ యూనియన్ కార్యదర్శి గోపాల్ అధ్యక్షతన పట్టణంలోని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. సివిల్ సప్లయీస్ హమాలీల కూలి అగ్రిమెంటు ముగిసి మూడు నెలలు అయినా వారి కూలి రేట్లు పెంచడంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పదిమంది కూలీలు ఒకచోట ఉంటే వారికి ఈఎస్‌ఐ అమలు చేయాలని నిబంధనలున్నప్పటికీ అమలు చేయడం లేదన్నారు. పీఎఫ్ అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అనంతరం డీఆర్వో రామునాయక్‌కు వినతిపత్రం అందజేశారు.