సబ్ జైలు తనిఖీ
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:36 AM
నందికొట్కూరు సబ్ జైలును బుధవారం జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) పి.వాసు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, నందికొట్కూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి, జూనియర్ సివిల్ న్యాయాధికారి దివ్య తనిఖీ చేశారు.
నందికొట్కూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు సబ్ జైలును బుధవారం జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) పి.వాసు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, నందికొట్కూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి, జూనియర్ సివిల్ న్యాయాధికారి దివ్య తనిఖీ చేశారు. ప్రిజన్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్, క్లినిక్‌ను తనిఖీ చేసిన జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) ‘జైలు ఖైదీలకు ప్రిజన్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ అండ్ క్లినిక్స్’ గురించి వివరించారు. ఇందులో ఒక అడ్వకేట్, ఒక పారా లీగల్ వలంటీర్ ఉంటారని, వారు జైలులోని ముద్దాయిలకు న్యాయ సహాయాలు అందిస్తారని చెప్పారు. ముద్దాయిలకు ఎవరికైనా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. 70 ఏళ్లు వయస్సు పైబడిన ముద్దాయిలకు, అనారోగ్యంతో బాధపడే వారికి ఉచిత న్యాయసహాయం అందిస్తామని, త్వరగా బెయిల్ మంజూరు అయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. ముద్దాయిలకు అందించే ఆహారాన్ని, రేషన్‌ను వారి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ముద్దాయిలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరు చేయాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థ కర్నూలును సంప్రదించవచ్చున్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్ 15100పై ప్రచారం చేసినట్లు తెలిపారు. జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ శ్రీనివాసులు, లీగల్ ఎయిడ్ న్యాయవాది వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, పారాలీగల్ వలంటీర్లు శోభారాణి, చిన్నరాజు పాల్గొన్నారు.