బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:08 AM
చిన్న వయస్సులోనే ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం, తద్వారా టీనేజ్ గర్భధారణలు సంభవించడం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపడమే జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యమని, బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆదోని సబ్‌కలెక్టర్ టి. అజయ్‌కుమార్ స్పష్టం చేశారు.
ఆదోని, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): చిన్న వయస్సులోనే ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం, తద్వారా టీనేజ్ గర్భధారణలు సంభవించడం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపడమే జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యమని, బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని ఆదోని సబ్‌కలెక్టర్ టి. అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. గురువారం తన కార్యాలయంలో ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసు, ఆరోగ్యశాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టేందుకు ఆశావర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళా పోలీసులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో టీనేజ్ వయస్సు పిల్లల కదలికలను గమనిస్తూ, ఎక్కడైనా బాల్యవివాహ ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే అడ్డుకోవాలని సూచించారు. చదువు మధ్యలో మానేసిన విద్యార్థుల వివరాలను సేకరించి వారిని తిరిగి బడిలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాలను తెలియజేయాలన్నారు. సబ్‌కలెక్టర్ కార్యాలయ డీఏవో వసుంధర, డిప్యూటీ డీఎంహెచ్‌వో, అలాగే సీడీపీవోలు సత్యవతి, డిల్లీశ్వరి, పోలీసుశాఖ సీఐ పాండురంగయ్య పాల్గొన్నారు.