పనులు వేగవంతం చేయండి
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:53 PM
డ్రోన్ సిటీ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డా.ఏ. సిరి ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు.
ఓర్వకల్లు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): డ్రోన్ సిటీ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డా.ఏ. సిరి ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఓర్వకల్లు మండలంలోని కొమరోలు గ్రామంలో ఏర్పాటు చేయనున్న డ్రోన్ సిటీ మొదటి దశ పనులను గుట్టపాడు సమీపంలో అభివృద్ధి చెందుతున్న నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీడీసీ) ప్రాజెక్టుల పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డ్రోన్ సిటీలో చేపడుతున్న మౌలిక వసతుల పనుల పురోగతిపై ఏపీఐఐసీ అధికారులను అడిగి తెలుసుకుని పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 600 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం చేపడుతుండగా.. తొలి దశలో 120 ఎకరాల విస్తీర్ణంలో రహదారులు, డ్రైన్లు, కల్వర్టర్లు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్ వివరించారు. అనంతరం గుట్టపాడు సమీపంలో అభివృద్ది చెందుతున్న నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీడీసీ) ప్రాజెక్టు పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్ పాల్గొన్నారు.
32 పరిశ్రమల ప్లాట్లు సిద్ధం
కర్నూలు కలెక్టరేట్: పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు- గుట్టపాడులో 32 పరిశ్రమల ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ డా.ఏ. సిరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఐఈపీసీ) సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏడు నియోజకవర్గాల్లో ఏడు ఎంఎస్‌ఎంఈ ఫార్కుల ఏర్పాటును వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో డిస్ర్టిక్ట్ మేనేజర్ ఇండస్ట్ర్టీస్ సంజీవ రాజు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి పాల్గొన్నారు.