Share News

అటవీశాఖ రక్షణ ఉద్యోగులందరికి పీక్‌ క్యాప్‌

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:45 PM

ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ పరిధిలోని రక్షణ విభాగంలో పనిచేస్తున్న అటవీశాఖ ఉద్యోగులందరికీ అరుదైన గౌరవాన్ని కల్పిస్తూ.. ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌అప్పావ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అటవీశాఖ రక్షణ ఉద్యోగులందరికి పీక్‌ క్యాప్‌
ఎఫ్‌బీవోకు పీక్‌ క్యాప్‌ను ధరింపజేస్తున్న డీడీ విఘ్నేష్‌ అప్పావ్‌

ఆత్మకూరు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ పరిధిలోని రక్షణ విభాగంలో పనిచేస్తున్న అటవీశాఖ ఉద్యోగులందరికీ అరుదైన గౌరవాన్ని కల్పిస్తూ.. ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌అప్పావ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి అటవీశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు టోపీ ఆధారంగానే తమ హోదాను ప్రదర్శించేవారు. అయితే. అటవీ శాఖ పరిధిలోని రక్షణ విభాగంలో పనిచేస్తున్న ప్రతిఒక్క ఉద్యోగి సమానమే అనే భావనతో 1989లోనే పీక్‌ క్యాప్‌ను ధరించేలా 10551/ఐవీ/98-1 అటవీశాఖ జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ మొదలుకొని రేంజ్‌ అఽధికారి వరకు పీక్‌ క్యాప్‌ ధరించేందుకు అవకాశం కానీ.. జీవో సక్రమంగా అమలు జరగకపోవడంతో అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ (ఏబీవో), ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌బీవో)లు బెర్రెట్‌ క్యాప్స్‌ ధరించేవారు. ఆ తర్వాత నుంచి ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఎస్‌వో), డిప్యూటీ రేంజర్‌, రేంజర్‌ స్థాయి అధికారులు మాత్రమే పీక్‌ క్యాప్‌ను ధరించేవారు. అయితే.. అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో ఉద్యోగుల హోదా ముఖ్యం కాదని.. వారి బాధ్యతలే కీలకమన్న ఉద్దేశం ప్రతిబింబించేలా ఆత్మ కూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ పనిచేస్తున్న ఏబీవో, ఎఫ్‌బీవోలు కూడా ప్రభుత్వ జీవో ప్రకారం పీక్‌ క్యాప్‌ ధరించేందుకు అనుమతించారు. గురువారం ఆయనే స్వయంగా ఏబీవోలు, ఎఫ్‌బీవోలకు పీక్‌ క్యాప్‌లను ధరింపజేశారు. ఆత్మ కూరు జూనియర్‌ ఫారెస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అనిల్‌కుమార్‌, ఉపాధ్యక్షులు సయ్యద్‌పీరా, కార్యదర్శి తాహీర్‌అహ్మద్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కావేరి, తమ్మిశెట్టి కుమార్‌, ట్రెజరర్‌ అబిదా ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jan 22 , 2026 | 11:45 PM