Share News

అనుమతులు లేకుండా లేఅవుట్లు వేస్తే ఉపేక్షించం

ABN , Publish Date - Mar 06 , 2026 | 01:13 AM

అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తే ఉపేక్షించబోమని కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

అనుమతులు లేకుండా లేఅవుట్లు వేస్తే ఉపేక్షించం
ఆరేకల్లులో అనుమతులు లేని వెంచర్‌ను పరిశీలిస్తున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

ఆదోని, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తే ఉపేక్షించబోమని కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆరేకల్లు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వేసిన లే అవుట్లను గురువారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్రమ లేఅవుట్‌ నిర్వాహకులపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమిశెట్టి మాట్లాడుతూ.. 15 రోజుల్లోపు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, లేనిపక్షంలో 15 రోజుల తర్వాత కట్టడాలను తొలగిస్తామని హెచ్చరించారు. అక్రమ లేఅవుట్లపై సమాచారం ఇచ్చినా పట్టించుకోని వీఆర్వో శ్రీనివాసులు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ‘కుడా’ అనుమతి లేని ప్లాట్లు కొంటే విద్యుత్‌ కనెక్షన్లు రావని, బ్యాంకు రుణాలు మంజూరు కావని చెప్పారు. 2025 జూన్‌ 30లోపు నిర్మాణాలు చేపట్టి ఉంటేనే అవి చెల్లుబాటు అవుతాయని, ఆ తర్వాత కుదరదని స్పష్టం చేశారు. కేవలం రూ.3 వేలతో అప్లికేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. లేఅవుట్‌ నిర్వాహకులు 15 రోజుల్లోపు అప్లికేషన్‌ పెట్టుకుంటే నిబంధనల ప్రకారం అప్రూవల్‌ ఇస్తామని తెలిపారు.

‘వైసీపీ హయాంలోని అక్రమాలను బయటకు తీస్తున్నాం’

గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని, వారి హయాంలో జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నామని సోమిశెట్టి ధ్వజమెత్తారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని, సామాన్యులకు అన్యాయం జరిగితే సహించబోమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శేషన్న, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ రామకృష్ణ, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ స్వామినాయక్‌, వెల్ఫేర్‌ అధికారి వీరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 01:13 AM