ఆదోని మాస్టర్ ప్లాన్‌పై కీలక సమీక్ష
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:40 PM
ఆదోని పట్టణాభివృద్ధికి చుక్కానిగా నిలవాల్సిన మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోకపోవడంపై ఎమ్మెల్యే డా.పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆదోని, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆదోని పట్టణాభివృద్ధికి చుక్కానిగా నిలవాల్సిన మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోకపోవడంపై ఎమ్మెల్యే డా.పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ అమలుకు భారీగా నిధులు అవసరమని, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గురువారం ఆర్డీవో అరుణాదేవి అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో రోడ్ల వెడల్పు, మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 1920లో బ్రిటీష్ కాలంలో ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ ప్రకారం రూపొందించిన ఆదోని జనరల్ టౌన్ ప్లానింగ్ స్కీం, ఆ తర్వాత 1987లో జీవో నం.761 ప్రకారం మంజూరైన మాస్టర్ ప్లాన్ ఏదీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని అన్నారు. ఇటీవల 2025 మేలో ప్రభుత్వం మరోసారి 20 ఏళ్లకు వర్తించేలా నూతన మాస్టర్ ప్లాన్‌ను మంజూరు చేసిందన్నారు. అయితే మున్సిపాలిటీలో టౌన్ సర్వేయర్ లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు భవనాలు, లే అవుట్లు వెలిశాయని, రోడ్లు, డ్రైనేజీల ఆక్రమణ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తానని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆదోని పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే పీఎన్ రోడ్డు, ఎంఎం రోడ్డు, బబ్బులమ్మ గుడి రోడ్డు, కౌడలాపేట రోడ్డు, బసవేశ్వర సర్కిల్ నుంచి కంట్రోల్ రూం వరకు కంట్రోల్ రూమ్ నుంచి ఏరియా ఆసుపత్రి వరకు రోడ్లను గుర్తించి 100 శాతం కచ్చితమైన మార్కింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్, పార్కింగ్‌పై హెచ్చరిక
వెంకటేశ్వర టీ స్టాల్ వద్ద సగం రోడ్డు ఆక్రమణ, శ్రీనివాస భవన్ హోటల్ వద్ద వంద అడుగులు ఉండాల్సిన రోడ్డు 62 అడుగులకు కుచించుకుపోవడంపై మండిపడ్డారు. 40 అడుగుల రోడ్డును ఆక్రమించినా చర్యలు తీసుకోకపోవడంపై మున్సిపల్, రెవెన్యూ అధికారులను తప్పుబట్టారు. పార్కింగ్ స్థలం లేకుండా భవనాలకు అనుమతులు ఎలా ఇచ్చారని, నిబంధనలు పాటించకుండా కట్టిన భవనాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డుపై వేసిన తెల్ల లైన్ దాటి ఒక్క వాహనం కూడా నిలపకుండా చూడాలని ట్రాఫిక్ సీఐ గౌస్‌కు సూచించారు. మున్సిపల్ షాపుల యజమానులు తమ షాపుల ఎదురుగా రోడ్డుపై పార్కింగ్ చేస్తే అటువంటి షాపుల లైసెన్సులు రద్దు చేయాలని కమిషనర్ నయూమ్‌అహమ్మద్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఏరియా ఆసుపత్రి వరకు షాప్ టూ షాప్ సర్వే చేసి మార్కింగ్ ఇవ్వాలన్నారు. అలాగే అక్రమ లేఅవుట్‌లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించాలని, ఆదోని మున్సిపాలిటీతో పాటు సాదాపురం, మండగిరి పంచాయతీల్లో కూడా మాస్టర్ ప్లాన్ కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీవో అరుణాదేవి, డీఎస్పీ వెంకటరమణ, తహసీల్దార్ వేణుగోపాల్, ట్రాఫిక్ సీఐ గౌస్, ఆర్‌అండ్‌బి ఈఈ పద్మనాభరెడ్డి, ఏసీపీ శిరీష, టీపీవో బాలమద్దయ్య, టీడీపీ మండల అధ్యక్షులు తిమ్మప్ప, జయరాం, నీలకంఠప్ప పాల్గొన్నారు.