పేదల భూముల్లోకి వస్తే ఊరుకోను
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:45 AM
పేదల భూముల జోలికి వస్తే ఊరుకోనని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కబ్జాదారులకు హెచ్చరించారు.
ఆదోనిటౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): పేదల భూముల జోలికి వస్తే ఊరుకోనని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కబ్జాదారులకు హెచ్చరించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించారు. సలకలకొండ గ్రామానికి చెందిన వెంకటరాముడు అనే పూజారికి సంబంధించిన రెండెకరాల 80 సెంట్ల పొలంలో కొంత ఇతరులు అక్రమించుకున్నారని, దానిని సర్వే చేయకుండా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అడ్డుపడుతున్నట్లు తనకు తెలిసిందని ఫిర్యాదు చేశారు. నెట్టేకల్ గ్రామానికి చెందిన హుసేనప్ప... తనకున్న 10 ఎకరాల పొలంలో ఐదెకరాలు ఇతరుల స్వాధీనంలో ఉందని, న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. కల్లుబావికి చెందిన రాఘవేంద్ర అనే రైతు అప్పుల బాధతో ఈనెల 11వ తేదిన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని, ఎఫ్‌ఐఆర్‌లో పిల్లల చదువుకోసం అని రాయడంతో ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం ఆయన కుటుంబానికి అందలేదని బంధువులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అలాగే పట్టణంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అధికారులు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఆదోని: భూకబ్జాలు చేసినా, రౌడీయిజంతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినా సహించే ప్రసక్తేలేదని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అత్యంత ఘాటుగా హెచ్చరించారు. గురువారం ఎమ్మెల్యే పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీ నాయులు భూకబ్జాలకు పాల్పడి, సామాన్య ప్రజలను పీడించారని విమర్శించారు. ఆ పాపం పండబట్టే ప్రజలు వారిని ఎన్నికల్లో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు.