ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు
ABN , Publish Date - May 18 , 2026 | 11:54 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. క్రాంతినాయుడు అన్నారు.
కర్నూలు అర్బన్, మే 18(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. క్రాంతినాయుడు అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నపత్రం అంశంలో సంబంధిత వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విచ్చలవిడిగా పెంచేశారని ధ్వజమెత్తారు. విత్తనాలు, మందుల ధరలు కూడా పెరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై మౌనం వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐఎన్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు బ్రతుకన్న, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాజాహుస్సేన్, నాయకులు సాబంశివుడు, సూర్యప్రకాశ్‌రెడ్డి, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.