చెరువులు నింపండి
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:39 AM
హంద్రీనీవా కాలువకు నీరు వస్తుందని, అధికారులు నిర్లక్ష్యం వీడి చెరువులను నింపాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు.
మద్దికెర, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా కాలువకు నీరు వస్తుందని, అధికారులు నిర్లక్ష్యం వీడి చెరువులను నింపాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శుక్రవారం పెరవలి రంగనాథస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మద్దికెర గ్రామ దేవత మద్దమ్మవ్వను దర్శించుకొని జడ్పీటీసీ సభ్యుడు డి.మురళిధర్ రెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో నీటి సమస్య అధికంగా ఉందన్నారు. ఈవిషయంపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించి నీటి సమస్య పరిష్కరించేందుకు నిధులు కూడా ఇచ్చామన్నారు. జిల్లాలో సుంకేసుల, గాజులదిన్నె ప్రాజెక్టులు ఉన్నప్పటికీ 6 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉందన్నారు. హంద్రీనీవాకు నీరు వదిలి నాలుగు రోజులవుతున్నా చాలా ప్రాంతాల్లో చెరువులకు నీరు వదలడం లేదన్నారు. జగన్‌కు వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేక అధికార పార్టీ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొత్తపేట వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్, ఎంపీటీసీలు చిట్టి, ఆంజనేయులు, వైసీపీ నాయకులు టీఈ వెంకటేశ్వరరెడ్డి, మంజునాథ్ రెడ్డి, పగడ్యాల, ఓర్వకల్లు జడ్పీటీసీలు పాల్గొన్నారు.