సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:28 AM
నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల మీదుగా వెళ్తున్న కేసీ కెనాల్ నూనెపల్లె సప్లయ్ చానల్ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజకుమారి జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు.
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల మీదుగా వెళ్తున్న కేసీ కెనాల్ నూనెపల్లె సప్లయ్ చానల్ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజకుమారి జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం మెడికల్ కళాశాలను ఆనుకుని ఉన్న కేసీకెనాల్ సప్లయ్ చానల్ కాల్వకు ఇరువైపులా రూ.32లక్షలతో జరుగుతున్న సుందరీకరణ పనులను కేసీ కెనాల్ ఈఈ ప్రతాప్‌తో కలిసి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ సుందరీకరణ పనులను ఎట్టి పరిస్థితుల్లోను ఆగస్టు నెలాఖరు లోపు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్యకళాశాల పరిసరాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావరణంలో ఉండేలా సుందరీకరణ పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కెనాల్‌లో లైనింగ్‌కు మరమ్మతులు చేయడంతో పాటు ఇన్‌స్పెక్షన్‌పాత్‌ను ఏర్పాటు చేసి గ్రావెల్ వేసేవిధంగా అధికారులను ఆదేశించామన్నారు. కెనాల్ పరిసరాల్లో పేరుకపోయిన చెత్త, మట్టి డంపులు, కలుపు మొక్కలను పూర్తిగా తొలగించి పరిశుభ్రంగా ఉంచేలా చూస్తామన్నారు. టెండర్ నిబంధనల ప్రకారం మూడు నెలల గడువులో పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఆగస్టు నెలాఖరులోపే అన్ని పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురా వాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాల భవనాల నిర్మాణ పురోగతి, హాస్టల్ భవనాల, విద్యాకార్యక్రమాల నిర్వహణ, ల్యాబ్‌ల పనితీరు గురించి ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఫ్యాకల్టీ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి బోధన, ల్యాబ్ కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని ప్రిన్సిపాల్ కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ నిరంజన్‌రెడ్డి, వైద్య కళాశాల ఏవో రమ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.