Share News

బోధనాసుపత్రుల్లో ఏఐ విద్యా విధానాలు

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:29 AM

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో త్వరలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత విద్యా విదానాలను ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు డా.ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ (విజయవాడ) వీసీ డా.పి.చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు.

బోధనాసుపత్రుల్లో ఏఐ విద్యా విధానాలు
మాట్లాడుతున్న ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీ చంద్రశేఖర్‌

కర్నూలు హాస్పిటల్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో త్వరలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత విద్యా విదానాలను ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు డా.ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ (విజయవాడ) వీసీ డా.పి.చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం కర్నూలు మెడికల్‌ కాలేజీ కౌన్సిల్‌ హాలులో పైలట్‌ ప్రాజెక్టు కింద అమలవుతున్న ఎడ్‌-మిడ్‌ ఏఐ పురోగతిని ఆయన సమీక్షించారు. భవిష్యత్తులో వైద్య రంగంలో ఏఐ కీలకపాత్ర పోషించనున్న నేపథ్యంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తమ నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవాలని ఆయన సూచించారు. వైద్యవిద్యలో ఉన్న ప్రమాణాలు సాదించేందుకు విశ్వవిద్యాలయం పరీక్ష విధానాన్ని మరింత పారదర్శకంగా కఠినంగా రూపొందించిందన్నారు. సమాజానికి ప్రతిభావంతులు, నైపుణ్యాలు కలిగిన వైద్యులను అందించగలమని పేర్కొన్నారు. పరిశోధనకు ఎంపికైన యూజీ విద్యార్థులకు 6 నెలలకు రూ.30వేలు అందిస్తామని, పీజీ విద్యార్థులకు రీసెర్చ్‌లో పాల్గొంటే ఒక ప్రాజెక్టుకు రూ.5లక్షలు స్కాలర్‌షిప్‌ అందిస్తామన్నారు. కర్నూలు మెడికల్‌ కాలేజీ నుంచి యూజీ నుంచి 40 మందికి గానూ 20 మంది తగ్గకుండా పరిశోధనలకు ఎంపికయ్యేలా కృషి చేయాలన్నారు. ఎడ్‌మెడ్‌ ఏఐ ప్రాజెక్టు రూపకర్త డా.బొందుగుల చంద్రశేఖర్‌ అమెరికాలో నివసిస్తూ తన సొంత కాలేజీ అభివృద్ధి కోసం ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ధ వహించడం అభినందనీయమన్నారు. కాలేజీలో ఆవరణంలోని స్కిల్‌ ల్యాబ్‌ను సందర్శించి బేసిక్‌ లైఫ్‌ సపోర్టు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డా.శ్రీరాములు, డా.విజయానందబాబు, డా.రేణుకాదేవి, డిప్యూటీ సూపరింటెండెంట్లు లక్ష్మీబాయి, డా.నాగేశ్వరరావు, వివిద విభాగాల హెచ్‌వోడీలు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 12:29 AM