ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:11 AM
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తహసీల్దార్ శేషఫణి హెచ్చరించారు.
ఆదోని, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తహసీల్దార్ శేషఫణి హెచ్చరించారు. సర్వే నెంబర్ 630లోని విలువైన ప్రభుత్వ భూమిని కబళించాలని చూస్తున్న భూ బకాసురుల గుట్టును ఆంధ్రజ్యోతి దినపత్రిక రట్టు చేయడంతో రెవెన్యూ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ‘భూ బకాసురుల’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించిన తహసీల్దార్ శేషఫణి, తన సిబ్బందితో గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుమారు 3.33 ఎకరాల రస్తా పోరంబోకు (ప్రభుత్వ దారి) స్థలాన్ని ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ శేషఫణి తన బృందంతో కలిసి సర్వేనంబర్ 630లో పర్యటించి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2020లో ఓ అధికారి తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని, ఇదే సర్వే నంబర్‌లోని దాదాపు ఒకటిన్నర ఎకరాల భూమిని తన బంధువుల పేరిట అక్రమంగా రాసిచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రభుత్వ దారిగా ఉన్న రస్తా పోరంబోకు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసి రూ.కోట్ల భూమిని కొట్టేయాలని చూస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూమిపై హక్కులు ఉన్నాయని చెప్పుకునే వారికి తహసీల్దార్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. సర్వే నెంబర్ 630లో ఎవరికైనా పట్టాలు మంజూరై ఉంటే వాటికి సంబంధించిన అసలు పత్రాలను 15 రోజుల్లోగా రెవెన్యూ కార్యాలయంలో సమర్పించాలని, గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ఆధారాలు చూపని పక్షంలో ఆ భూమిని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తహసీల్దార్ స్పష్టం చేశారు.